
టెడ్రోస్ అదానన్ గేబ్రియేసస్
జెనీవా : కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న అన్ని వర్గాల ఆరోగ్య సిబ్బందికి సరైన రక్షణ కవచాలు లేకపోవటం ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తోన్న సమస్యని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అదానన్ గేబ్రియేసస్ పేర్కొన్నారు. ఈ సమస్యతో కరోనా మరణాలను తగ్గించటం అసాధ్యమని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) కొరత ప్రపంచాన్ని వేధిస్తోన్న ప్రధానమైన సమస్య. మేము ఇప్పటివరకు రెండు మిలియన్ల పీపీఈలను 74 దేశాలకు సరఫరా చేశాము. అంతే మొత్తంలో తయారుచేసి మరో 60 దేశాలకు పంపటానికి చూస్తున్నాం. అంతర్జాతీయ సహకారం, సంఘీభావంతో మాత్రమే ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఈ విషయమై జీ20 దేశాలకు విజ్ఞప్తి చేశాను. ( కరోనాపై ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం...అరెస్ట్ )
భవిష్యత్తులో ఇలాంటి వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు మనం ప్రతినబూనాలి. యద్ధం ఇప్పుడే మొదలైంది.. మౌనంగా.. ఐక్యంగా, కలిసి పనిచేయాల్సిన తరుణం ఇద’ని అన్నారు. కాగా, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా.. 27వేల మంది మరణించారు.