రాత్రిపూట అధిక వేడి.. సీక్రెట్ తెలిసింది
లండన్: పగటి పూట కంటే రాత్రి వేళల్లో వేడి ఎందుకు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిపోయిందట. గత యాబై ఏళ్లుగా అధ్యయనం చేస్తున్న పరిశోధనలకు తగిన ఫలితం కనిపించింది. రాత్రి పూట వాతావరణంలో మార్పులు చాలా త్వరగా సంభవిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే భూమికి పగటి పూట కంటే కూడా రాత్రి సమయాలలో వేడికి గ్రహించేశక్తి ఎక్కువగా ఉంటుందట. ఇందుచేతనే రాత్రిళ్లు వాతావరణ మార్పులను త్వరగా పసిగట్టేయవచ్చునని పరిశోధకులు తేల్చేశారు. 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లైమెటాలజీ' లో రీసెర్చర్స్ కనుగొన్న వివరాలు ప్రచురితమయ్యాయి. నార్వే కేంద్రంగా ఉన్న నాన్సెన్ ఎన్విరాన్ మెంటల్ అండ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రీసెర్చర్ రిచర్డ్ డేవీ నేతృత్వంలో 20వ శతాబ్ధం వాతావరణ మార్పులపై ఈ అధ్యయనం నిర్వహించారు.
వాతావరణ మార్పు అనేది గాలి లోని కొన్ని పొరలలో వచ్చే మార్పులతో సంబంధం కలిగి ఉందని కనుగొన్నారు. పగటిపూట ఈ పొర చాలా కిలోమీటర్ల మందంతో ఉంటుందని, రాత్రివేళల్లో ఈ పొర చాలా పలుచగా, కేవలం వందల మీటర్ల మందంతో ఉంటుందట. ఈ కారణం వల్లనే రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు పగటి పూట కంటే చాలా సెన్సిటివ్ గా ఉంటాయని రీసెర్చ్ లో కనుగొన్నారు. మనం ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్ ను గాలిలోకి వదులుతుంటాం కదా.. అయితే రాత్రివేళల్లో కార్బన్ డై ఆక్సైడ్ తో మరికొంత శక్తి కలిసి ఉష్ణోగ్రతను పెంచేస్తాయని గుర్తించారు. గత యాబై ఏళ్ల రాత్రివేళ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... గతంలో కంటే ఈ 5 దశాబ్దాలుగా రాత్రివేళల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించవచ్చని రీసెర్చర్స్ చెబుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు నాలుగో వంతు ఉష్ణోగ్రత పెరిగిందని, ఈ వాతావరణ ఉష్ణోగ్రత మార్పులు వల్ల మానవుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రిచర్డ్ డేవీ నాన్సెస్ బృందం వివరించింది.