
'పాక్‌ను రచ్చకు ఈడుస్తాం'
కాబూల్: పాకిస్థాన్కు అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని గట్టి ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య మంచి సహకారం కొనసాగుతోందని ప్రపంచ దేశాలు భావిస్తుండగా అవేం లేవని తాజా వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. తమ దేశ సరిహద్దు వెంబడి గుండా జరుగుతున్న ఉగ్రవాద చర్యలకు పాకిస్థాన్ పరోక్ష కారణం అని ఆయన ఆరోపించారు. ప్రతి రోజు చొరబాట్లకు పాల్పడుతూ హింసను సృష్టిస్తున్నా తాలిబన్లపై పాకిస్థాన్ ఎందుకు చర్య తీసుకోవడం లేదని చెప్పారు.
వాస్తవానికి పాక్ కు తాలిబన్ ను అణిచివేసేంతటి సైనిక బలం ఉందని, అయినా కావాలనే ఆ ఉగ్రవాదులపై చేయి వేయకుండా వారికి అవకాశం ఇస్తున్నారని, అందుకే తమ దేశ సరిహద్దు వెంబడి ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారని ఆరోపించారు. త్వరలోనే ఐక్యరాజ్య సమితికి పాకిస్థాన్ను ఈడుస్తున్నాని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
తాలిబన్లకు వ్యతిరేకంగా పాకిస్థాన్ చర్యలు తీసుకోకుంటే మాత్రం పై చర్యల విషయంలో తప్పక ముందుకు వెళతామని అన్నారు. తాలిబన్లు తమ వ్యవహారాలను పాకిస్థాన్ నుంచి కొనసాగిస్తున్నారని, అందుకే వారిపై చర్యలు తీసుకునే అవకాశం పాకిస్థాన్కే ఉందని చెప్పారు. 'నేను ఈ సందర్భంగా ఓ విషయం చెప్పదలుచుకున్నాను. పాకిస్థాన్ తాలిబన్ నాయకులను శాంతి చర్చలకోసం తీసుకొస్తుందని నేను అనుకోవడం లేదు' అని ఘనీ అఫ్గన్ పార్లమెంటు ఉభయ సభల్లో మాట్లాడారు.