
కణ మార్పిడితో మళ్లీ నడిచాడు!
లండన్: పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి పోలండ్ వైద్యులు కణమార్పిడి చికిత్సతో తిరిగి నడవగలిగాడు. డెరెక్ ఫిడికా (38)పై 2010లో ఓ వ్యక్తి కత్తితో దాడిచేయడంతో అతడి వెన్నుపాము చిట్లిపోయి..ఛాతీ కింది నుంచి దేహం చచ్చుబడిపోయింది. పూర్తిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. అయితే.. డెరెక్ కేసును సవాల్‌గా తీసుకున్న పోలండ్ వైద్యులు లండన్ వైద్యుల సాయంతో చికిత్స ప్రారంభించారు. ముక్కు వెనక వాసనలు గ్రహించేందుకు తోడ్పడే ఘ్రాణశక్తి కణాలు(ఆల్ఫాక్టరీ ఎన్‌షీతింగ్ సెల్స్-ఓఈసీ)ను సేకరించి ప్రయోగశాలలో అభివృద్ధిపర్చారు. వాటిని వెన్నుపాము దెబ్బతిన్నచోటకు ఇంజెక్షన్ చేశారు. చీలమండ నుంచి నాడీకణజాలాన్ని సేకరించి వెన్నుపాము ఖాళీవద్ద అతికించారు.
మూడునెలల చికిత్స తర్వాత ఫలితం కనిపించింది. వెన్నుపాములో తెగిపోయిన నాడీకణాలు ఘ్రాణ నాడీకణాలతో తిరిగి అనుసంధానం అయ్యాయి. దీంతో ఛాతీ కింద అవయవాలకు స్పర్శ, చలనం వచ్చింది. ప్రస్తుతం డెరెక్ కొద్దిగా నడవగలుగుతున్నాడు. వెన్నెముక దెబ్బతిన్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుందని చికిత్సకు నేతృత్వం వహించిన వ్రోక్లా వర్సిటీ డాక్టర్ పావెల్ తబకోవ్ వెల్లడించారు.