హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా బ్రోకర్ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: ఓ మహిళా బ్రోకర్ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్ లోని ఒమన్ నగరానికి చెందిన గొప్ప ధనవంతుడితో పెళ్లి అని చెప్పి నమ్మించి ఓ బిచ్చగాడికి కట్టబెట్టిన కిలాడీ సాజిద్ బేగంను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం... వరుడు అరబ్ షేక్ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి నగరంలోని ఓ ముస్లిం కుటుంబాన్ని సాజిదా బేగం నమ్మించింది. పెళ్లి తరువాత అమ్మాయికి మంచి ఉద్యోగం కూడా అతనే చూస్తాడంటూ అరచేతిలో స్వర్గం చూపించింది. ఆమె మాటలను నమ్మి గత ఆగస్టులో తమ కూతురు(28)కి ముస్లిం సాంప్రదాయం ప్రకారం నిఖా జరిపించారు. కోటి ఆశలతో కూతుర్ని ఒమన్ కు పంపించారు. తీరా అక్కడి వెళ్లాక తను పెళ్లి చేసుకుంది ఓ బిచ్చగాడినని తెలుసుకుని నివ్వెర పోయిందా యువతి. జరిగిన మోసాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో సాజిద్ బేగం మోసం వెలుగులోకి వచ్చింది.
దీంతో బాధితురాలి తండ్రి గత నవంబరులో సాజిద్ బేగంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు విచారణలో భాగంగా సాజిద్ బేగం ను అదుపులోకి తీసుకున్నామని దక్షిణమధ్య పోలీసులు తెలిపారు. బాధిత యువతిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.