మన పాతబస్తీలో.. మరో పుత్తడిబొమ్మ | Arab sheikh marries Hyderabad minor girl and tortured her | Sakshi
Sakshi News home page

మన పాతబస్తీలో.. మరో పుత్తడిబొమ్మ

Aug 18 2017 2:08 AM | Updated on Oct 16 2018 5:58 PM

మన పాతబస్తీలో.. మరో పుత్తడిబొమ్మ - Sakshi

మన పాతబస్తీలో.. మరో పుత్తడిబొమ్మ

అరబ్బుల దాష్టీకాలకు పాతబస్తీ అమ్మాయిలు బలవుతున్నారు. ఎడారి దేశం నుంచి వచ్చి వాలుతున్న కామాంధులు మైనర్లను కూడా పెళ్లిళ్లు చేసుకొని వారి గొంతు కోస్తున్నారు.

  • మళ్లీ వేటాడిన ముసలి షేక్‌
  • 76 ఏళ్ల అరబ్‌ షేక్‌తో మైనర్‌ బాలికకు పెళ్లి
  • రూ.5 లక్షలు తీసుకొని వివాహం జరిపించిన మేనత్త
  • కష్టాలు తీరుతాయంటూ తల్లిదండ్రులకు మాయమాటలు
  • ఒమన్‌కు వెళ్లాక అమ్మాయికి నరకం
  • షేక్‌ కొడుకులు, మనవళ్ల లైంగిక దాడి
  • ఇక్కడుంటే చనిపోతానంటూ ఫోన్‌ చేసిన బాలిక
  • పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు
  • మేనత్తపై కేసు.. మైనర్‌ను తెస్తామని వెల్లడి
  • సాక్షి హైదరాబాద్‌: అరబ్బుల దాష్టీకాలకు పాతబస్తీ అమ్మాయిలు బలవుతున్నారు. ఎడారి దేశం నుంచి వచ్చి వాలుతున్న కామాంధులు మైనర్లను కూడా పెళ్లిళ్లు చేసుకొని వారి గొంతు కోస్తున్నారు. తల్లిదండ్రులకు లక్షల్లో డబ్బు ఆశ చూపి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, తర్వాత వారి దేశం తీసుకెళ్లడం, కామవాంఛ తీరిన తర్వాత నరకం చూపిస్తుండటంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

    షేక్‌ కుటుంబీకులు కూడా లైంగిక దాడులకు పాల్పడుతుండటంతో దేశం కాని దేశంలో అత్యంత దుర్భర జీవితాలను గడుపుతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్‌ అమ్మాయిని ఆమె మేనత్తే ఒమన్‌కు చెందిన 76 ఏళ్ల అరబ్‌ షేక్‌కు కట్టబెట్టింది. పెళ్లి తర్వాత ఒమన్‌ వెళ్లిన ఆ అమ్మాయి తన దారుణ పరిస్థితిని తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపింది. ఈ నరకం నుంచి తనను కాపాడకుంటే విషం తాగి చనిపోతానని విలపించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ వి.సత్యనారాయణ, అదనపు డీసీపీ కె.బాబురావులు గురువారం ఈ వివరాలు వెల్లడించారు.

    మాయమాటలు చెప్పి పెళ్లి..
    ఫలక్‌నుమా పరిధిలోని నవాబ్‌సాబ్‌కుంట ప్రాంతానికి చెందిన అఫ్జల్‌ బేగం ఆలియాస్‌ సైదున్నీసా, ఆఫ్సర్‌లు దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద అమ్మాయి తొమ్మిదో చదువుతోంది. తమ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తమ అమ్మాయిని వట్టేపల్లిలోని ఉంటున్న చెల్లి గౌసియా ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. గౌసియా.. ఖద్దామా(సేవకురాలు) వీసాపై వెళ్లి ఒమన్‌లో నివసిస్తోంది. ఈమె ఒమన్‌ షేక్‌లకు ఇక్కడి అమ్మాయిలతో పెళ్లిళ్లు చేయిస్తోంది. ఇటీవల ఆ దేశం నుంచి వచ్చిన 76 ఏళ్ల షేక్‌కు ఐదుగురు అమ్మాయిలను చూపించింది. అతడికి ఎవరూ నచ్చకపోవడంతో గౌసియా దృష్టి తన ఇంట్లో ఉంటున్న అన్న కూతురిపై పడింది. ఒమన్‌ షేక్‌తో అమ్మాయి పెళ్లి చేయిస్తే రూ.5 లక్షలు వస్తాయని, పేదరికం పోతుందని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అమ్మాయి కూడా విలాసవ విలాసవంతమైన జీవితం గడుపుతుందని మాయమాటలు చెప్పి ఒప్పించింది. రంజాన్‌ మాసంలో వివాహం చేయించింది.

    అక్కడికి వెళ్లాక నరకం..
    పెళ్లి అయిన నాలుగు రోజులు తర్వాత షేక్‌ ఒమన్‌ వెళ్లాడు. గతనెలలో గౌసియా.. తన మేనకోడల్ని ఒమన్‌ తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లాక ఆమెకు నరకం చూపిస్తున్నారు. పెళ్లాడిన వృద్ధ షేక్‌ జాడ లేదు. తీసుకెళ్లిన మేనత్త ఆచూకీ లేదు. షేక్‌ కొడుకులు, మనవళ్లు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. చివరికి తనకు అన్నం కూడా పెట్టడం లేదంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లికి ఫోన్‌ చేసింది. తనను ఇక్కడ్నుంచి విడిపించకుంటే విషం తాగి చచ్చిపోతానని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

    అరబ్‌ షేక్‌ తన రూ.5 లక్షలు చెల్లిస్తే తిరిగి బాలికను పంపుతానని చెబుతున్నట్టు అమ్మాయి తల్లి చెబుతోంది. అరబ్‌ షేక్‌ను అరెస్ట్‌ చేస్తామని, బాలికను హైదరాబాద్‌ తెస్తామని పోలీసులు తెలిపారు. మేనత్త గౌసియా, ఆమె భర్త సికిందర్, పెళ్లి చేసిన ఖాజీలపై కేసులు నమోదు చేశామన్నారు. బాలికను రక్షించేందుకు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపినట్టు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement