
అమెరికా పోలీసులు ఓ మహిళని సౌత్ వేస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం నుంచి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వివరాలు.. సౌత్ వేస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఓ మహిళ( పేరు వెల్లడించలేదు ) బాల్టిమోర్ నుంచి లాస్‌ఏంజిల్స్‌కు వెళ్లడానికి సిద్ధమైంది. అయితే అదే విమానంలో రెండు శునకాలు కూడా ఆన్‌బోర్డులో ఉన్నాయి. దీంతో కుక్కలంటే తనకు అలెర్జీ ఉందని, తనకు ప్రాణాంతకమైన వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉందని విమాన సిబ్బందికి ఆ మహిళ ఫిర్యాదు చేశారు. శునకాలని విమానం నుంచి పంపించాలని సిబ్బందిని కోరారు. అయితే సిబ్బంది దానికి నిరాకరించి ఆమెనే వెళ్లిపోవాలని ఆదేశించారు. దీనికి నిరాకరించడంతో ఆమెను బయటికి పంపించడానికి విమాన సిబ్బంది పోలీసుల సహకారాన్ని కోరారు.
ముందుగా సౌత్ వెస్ట్ సిబ్బంది మహిళతో విమానంలోని వెనకవైపు భాగంలో చర్చించారని ప్రయాణికులు తెలిపారు. మరుసటిరోజు ఉన్న తమ విమానసర్వీసులో ఆమెకు టికెట్ బుక్ చేస్తామని సిబ్బంది చెప్పినా ఆమె నిరాకరించిందని తెలిపారు. ఆ రోజులో అదే చివరి విమానం కావడంతో తాను ఖచ్చితంగా దాంట్లోనే వెళ్తానని తేల్చిచెప్పిందని తోటి ప్రయాణికులు చెప్పారు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులతో కూడా తాను విమానంలో నుంచి దిగనని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఓ పోలీసు అధికారి అమె వీపువెనక నుంచి ముందుకు చేతులు పెట్టి ఆమెను సీట్లోనుంచి పైకి లాగగా, మరో వ్యక్తి ముందు కాళ్లను పట్టుకొని మహిళ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారు.
అయితే అమెరికాలోనే గత ఏప్రిల్‌లో చికాగోలో యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తిని పోలీసులు తన సీటు నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి విమానం దింపారు. ఆ ఘటనపై అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో జరిగిన తప్పిదమే తిరిగి పునరావృతం అవ్వడంతో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఆలస్యం చేయకుండా సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణికురాలిని విమానం నుంచి దించడానికి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి క్రిస్ మెయిన్జ్ తెలిపారు. శునకాలతో తన ఆరోగ్యానికి ఇబ్బంది అని మెడికల్ సర్టిఫికెట్లు చూపించి ఉంటే ఆమె ప్రయాణానికి ఇబ్బంది ఉండకపోయి ఉండేదన్నారు.
'మా నాన్నకి సర్జరీ ఉంది. నేను ఖచ్చితంగా వెళ్లాలి' అంటూ ప్రాదేయపడినా పోలీసులు ఆ మహిళా ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 'మీరు అసలు ఏం చేస్తున్నారు. నా ప్యాంటు కూడా ఊడి పోతోంది(సరి చేసుకుంటూ).. నేను నడవగలను .. దయచేసి నా మీద చేతులు వేయకండి.. నేనొక ప్రొఫెసర్‌ని' అంటూ ఆ మహిళ చెప్పడం వీడియోలో రికార్డయింది. హాలీవుడ్ సినీ నిర్మాత బిల్ డుమాస్ ఈ తతంగాన్ని మొత్తం తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు పోలీసుల తీరుపై త్రీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ మహిళా ప్రొఫెసర్‌పై ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. 'విమానం నుంచి దింపకూడదని ఆమె అధికారులతో చివరివరకు పోరాడింది' అని బిల్ డుమాస్ తెలిపారు.