Southwest Airlines
-
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా ఇండిగో కో-ఫౌండర్
ఇండిగో కో-ఫౌండర్ 'రాకేష్ గంగ్వాల్' అమెరికాలోనే ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జులైలో బోర్డులో మెంబర్‌షిప్‌గా చేరిన గంగ్వాల్.. ఇటీవల 108 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 900 కోట్లు) విలువైన షేర్స్ కొనుగోలు చేశారు.కొత్త బోర్డు కమిటీ అధ్యక్షుల పేర్లతో పాటుగా గంగ్వాల్ స్వతంత్ర బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తిరిగి బలమైన ఆర్థిక పనితీరుకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రెసిడెంట్, సీఈఓ బాబ్ జోర్డాన్ సహకారం కూడా ఉంటుందని గంగ్వాల్ పేర్కొన్నారు.సెప్టెంబరు 30, అక్టోబరు ప్రారంభంలో గంగ్వాల్ 3.6 మిలియన్ షేర్లను సౌత్‌వెస్ట్‌లో కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు 29 డాలర్ల నుంచి 30 డాలర్ల మధ్యలో ఉన్నాయి. మొత్తం పెట్టుబడి 108 మిలియన్ డాలర్లు. గంగ్వాల్ వరల్డ్‌స్పాన్ టెక్నాలజీస్‌కు చైర్మన్ & సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈయన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధి. 2022లో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని స్థాపించారు. -
విమానంలో 135 మంది ప్రయాణికులు.. గాల్లోనే ఊడిన ఇంజిన్ కవర్
విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ఇంజిన్ కవర్ ఊడిపోయిన సంఘటన ఇటీవల అమెరికాలోని డెన్వర్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో డెన్వర్ ఎయిర్‌పోర్టు నుంచి హోస్టన్కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజిన్ కవర్ ఊడిపోయింది. అలా ఊడిన కవర్ విమానం కుడివైపు రెక్కలపై ఉన్న ఫ్లాప్స్‌లో చిక్కుకుంది. విమాన సిబ్బంది, పైలట్లు సమస్యను వెంటనే గుర్తించి అప్పటికే గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి, కిందకు దించారు. డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లోని గ్రౌండ్ సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు. ఘటన సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులను వేరే విమానంలో హోస్టన్కు తరలించారు. ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: లగేజీ తీసుకురావడానికి రూ.25 కోట్ల కాన్వాయ్! గతంలోనూ అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లో ఉండగానే డోర్ ఒక్కసారిగా ఊడిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల జపాన్‌లో అల్ నిప్పాన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 737-800 కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు గుర్తించిన పైలట్లు.. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. -
తల్లివని నిరూపించుకో...
న్యూయార్క్ : అప్పుడప్పుడు ఎయిర్ పోర్టు అధికారులు కాస్తా విచిత్రంగా ప్రవర్తిస్తారు. తమ తెలివి తక్కువ పనులతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి...ఆనక క్షమించమని కోరతారు. సరిగా ఇలాంటి పనే చేశారు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్ అధికారులు. ఓ ప్రయాణికురాలితో పాటు ప్రయాణిస్తున్న ఆమె సంవత్సరం కొడుకుకు తానే కన్నతల్లని నిరూపించుకోవాలని కోరారు. పాస్‌పోర్టు చూపించనా నమ్మని వాళ్లు చివరకూ ఫేస్బుక్ పోస్టు చూసి సమాధాన పడ్డారు. ఇందుకు సంబంధించిన విషయాలను సదరు ప్రయాణికురాలు తన ట్విటర్లో పోస్టు చేసింది. వివరాల ప్రకారం.. బెర్కిలీస్లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో మహిళా బాస్కెట్ బాల్ కోచ్‌గా పనిచేస్తున్న లిండ్సే గోట్లీబ్ తన ఏడాది వయసున్న కొడుకుతో కలిసి ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా సౌత్‌వెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. భద్రతా తనిఖీల్లో భాగంగా ఎయిర్‌పోర్టు అధికారులు లిండ్సే పాస్ పోర్టుతో పాటు, ఆమె కొడుకు పాస్‌పోర్టును కూడా తనిఖీ చేశారు. అన్ని సరిగానే ఉన్నప్పటికి కూడా లిండ్సేనే ఆమెతో పాటు ఉన్న బాబుకు కన్నతల్లని నిరూపించుకోవాల్సిందిగా కోరారు. చివరకూ ఆమె ఫేస్బుక్ పోస్టు చూసిన తర్వాతే ఆమెను ప్రయాణించడానికి అనుమతించారని లిండ్సే తన ట్విటర్లో పోస్టు చేశారు. అంతేకాక ఈ విషయం గురించి లిండ్సే ‘నా కొడుకు వయసు, గుర్తింపుకు సంబంధించి అన్ని విషయాలు పాస్‌పోర్టులో ఉన్నాయి. పైగా ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరమూ అక్కడే ఉన్నాం. అయినా అధికారులు నేనే నా బిడ్డకు కన్నతల్లినని నిరూపించుకోమని కోరారు. ఒక తల్లికి ఇది ఎంత బాధకరమైన విషయమో వారికి తెలియదనుకుంటా. బహుశా నా కొడుకు శరీర రంగు, నా రంగుకు భిన్నంగా ఉండటం వల్ల వారు ఇలా అడిగి ఉంటారు’ అని అన్నారు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఎయిర్‌పోర్టు అధికారులను విమర్శించడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. కేవలం తనఖీల్లో భాగంగానే తమ సిబ్బంది అలా ప్రశ్నించారే తప్ప ఆమెను బాధపెట్టాలనే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని చెప్పారు. మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించినందుకు క్షమించమని లిండ్సేను కోరారు. అందుకు లిండ్సే ‘ఇక మీదట ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలనే అంశం గురించి మీ సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ ఇస్తే మంచిద’ని చురకంటిచారు. -
‘మహిళా పైలట్.. మీకు సెల్యూట్..’
వాషింగ్టన్ : సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మహిళా పైలట్ టామ్ జో షల్ట్స్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. గత నెల 17న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 1380 విమాన ఇంజిన్ పేలిపోవడంతో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పైలట్ టామ్ జో షల్ట్స్ చాకచక్యంగా వ్యవహరించి 144 మంది ప్రాణాలను కాపాడారు. ఈ నేపథ్యంలో పైలట్ టామ్‌తోపాటు విమాన సిబ్బందిని అభినందించేందుకు ట్రంప్ వారిని వైట్‌హౌజ్‌కి ఆహ్వానించారు. ఓవల్ ఆఫీస్‌లో వారితో సమావేశమైన ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎంతోమంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన, ధైర్యవంతులైన హీరోలు వైట్‌హౌజ్‌కి రావడం నాకెంతో గర్వంగా ఉందం’టూ అభినందించారు. ‘మీ ధైర్యం వల్లే ఎంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. మీకు సెల్యూట్ చేస్తున్నానంటూ’ ట్రంప్ టామ్ జో షల్ట్స్‌ను అభినందించారు. ఎవరీ టామ్ జో షల్ట్స్.. అమెరికన్ నేవీలో పనిచేసిన మొదటి మహిళా పైలట్లలో టామ్ జో షల్ట్స్ ఒకరు. సూపర్సోనిక్ ఎఫ్‌జె-18 హార్నెట్స్ వంటి విమానాలు నడిపిన ఘనత ఆమె సొంతం. ఆ అనుభవంతోనే 30 వేల అడుగులో ఇంజన్ పేలిపోయినా ఆమె ధైర్యం కోల్పోకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి.. వందల మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ధీర వనితగా అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. -
ఆ 20 నిమిషాల పాటు ప్రత్యక్ష నరకం..
న్యూయార్క్ : అది సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం. ఫ్లైట్ నంబర్ 1380. మంగళవారం ఉదయం 11 గంటలకు 144 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సహాయక సిబ్బందితో న్యూయార్క్ నుంచి డల్లాస్‌కు బయల్దేరింది. కానీ అంతలోనే పేలుడు శబ్దం వినపడటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంజన్ పేలిపోయిందని తెలుసుకున్న ప్రయాణికులు.. అప్పటివరకు పిల్లల కేరింతలను ఆస్వాదిస్తూ కాలక్షేపం కోసం సుడోకు ఆడుతూ, పాటలు వింటూ, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వారంతా భయంతో హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. విమానం ఫ్యాన్ బ్లేడ్ చెడిపోవడంతో పదునైన రెక్క దూసుకురావడంతో కిటికీ పాక్షికంగా చెదిరిపోయింది. కిటికీ పక్కనే ఉన్న రియోర్డాన్ అనే ప్రయాణికురాలు ఒక్కసారిగా జారి కిందపడబోయింది. భూమి నుంచి 30 వేల అడుగుల ఎత్తులో.. ఊహించని ఈ పరిణామాలతో ప్రయాణికులు తమకు ఇక మరణం తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసి ఇవే తమ ఆఖరి క్షణాలు అంటూ భోరున విలపించారు. దేవుడా నువ్వే దిక్కు.. 7 ఏళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన షేరీ పియర్స్ అనే ప్రయాణికురాలు తన 11 ఏళ్ల కూతురుకి కూడా అదే కష్టం వస్తుందేమో అని బాధపడుతూ.. ‘ఈ బాధ, యాతన భరించలేను. దేవుడా త్వరగా తీసుకెళ్లు’ అంటూ ప్రార్థించడంతో తోటి ప్రయాణికులు కూడా కన్నీటి పర్యంతమాయ్యారు. విమానంలో ఉన్న ఓ జంట ‘ముగ్గురు పిల్లల్ని చూడకూడకుండానే చనిపోతున్నాం. దేవుడా నువ్వే వారికి దిక్కు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘జీసస్ నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడాలి’ అంటూ ప్రయాణికులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. 20 నిమిషాల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించిన తర్వాత పైలట్ చాకచక్యం వల్ల ఫిలడెల్ఫియాలో విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ కిటికీ నుంచి జారిపడి పోయిన రియెర్డాన్ను లోపలికి లాగినప్పటికీ తీవ్రగాయాల పాలైన ఆమె.. కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు గాయపడ్డారు. ఆమె ధైర్యం వల్లే.. అమెరికన్ నేవీలో పనిచేసిన మొదటి మహిళా పైలట్లలో టామ్ జో షల్ట్స్ ఒకరు. సూపర్సోనిక్ ఎఫ్‌జె-18 హార్నెట్స్ వంటి విమానాలు నడిపిన ఘనత ఆమె సొంతం. ఆ అనుభవంతోనే 30 వేల అడుగులో ఇంజన్ పేలిపోయినా ఆమె ధైర్యం చెక్కు చెదరలేదు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడటమే ఆమె ముందున్న లక్ష్యం. అందుకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఫిలడెల్ఫియా అధికారులకు సమాచారం ఇచ్చింది. వారు కూడా వెంటనే స్పందించి కావాల్సిన సహాయం అందించారు. క్షేమంగా ల్యాండ్ అవడానికి అప్పటికీ ఆమెకున్న అవకాశాలు తక్కువే. అయినప్పటికీ ధైర్యం చేసింది. ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ధీర వనితగా అందరిచే ప్రశంసలు అందుకుంది. అయితే అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన జరిగిన విమాన ప్రమాదాల్లో 2009 తర్వాత ఇదే మొదటి మరణం అని అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన ఫ్లైట్-1380 విమాన ప్రమాదం వల్ల అప్రమత్తమయ్యామని వారు పేర్కొన్నారు. ఇంజన్‌లోని బ్లేడ్ పాతబడటం వల్లే పేలుడు సంభవించిందని తెలిపారు. -
మహిళ అని కూడా చూడకుండా..
అమెరికా పోలీసులు ఓ మహిళని సౌత్ వేస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం నుంచి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వివరాలు.. సౌత్ వేస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఓ మహిళ( పేరు వెల్లడించలేదు ) బాల్టిమోర్ నుంచి లాస్ఏంజిల్స్కు వెళ్లడానికి సిద్ధమైంది. అయితే అదే విమానంలో రెండు శునకాలు కూడా ఆన్‌బోర్డులో ఉన్నాయి. దీంతో కుక్కలంటే తనకు అలెర్జీ ఉందని, తనకు ప్రాణాంతకమైన వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉందని విమాన సిబ్బందికి ఆ మహిళ ఫిర్యాదు చేశారు. శునకాలని విమానం నుంచి పంపించాలని సిబ్బందిని కోరారు. అయితే సిబ్బంది దానికి నిరాకరించి ఆమెనే వెళ్లిపోవాలని ఆదేశించారు. దీనికి నిరాకరించడంతో ఆమెను బయటికి పంపించడానికి విమాన సిబ్బంది పోలీసుల సహకారాన్ని కోరారు. ముందుగా సౌత్ వెస్ట్ సిబ్బంది మహిళతో విమానంలోని వెనకవైపు భాగంలో చర్చించారని ప్రయాణికులు తెలిపారు. మరుసటిరోజు ఉన్న తమ విమానసర్వీసులో ఆమెకు టికెట్ బుక్ చేస్తామని సిబ్బంది చెప్పినా ఆమె నిరాకరించిందని తెలిపారు. ఆ రోజులో అదే చివరి విమానం కావడంతో తాను ఖచ్చితంగా దాంట్లోనే వెళ్తానని తేల్చిచెప్పిందని తోటి ప్రయాణికులు చెప్పారు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతో కూడా తాను విమానంలో నుంచి దిగనని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఓ పోలీసు అధికారి అమె వీపువెనక నుంచి ముందుకు చేతులు పెట్టి ఆమెను సీట్లోనుంచి పైకి లాగగా, మరో వ్యక్తి ముందు కాళ్లను పట్టుకొని మహిళ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారు. అయితే అమెరికాలోనే గత ఏప్రిల్‌లో చికాగోలో యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తిని పోలీసులు తన సీటు నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి విమానం దింపారు. ఆ ఘటనపై అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో జరిగిన తప్పిదమే తిరిగి పునరావృతం అవ్వడంతో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఆలస్యం చేయకుండా సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణికురాలిని విమానం నుంచి దించడానికి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి క్రిస్ మెయిన్జ్ తెలిపారు. శునకాలతో తన ఆరోగ్యానికి ఇబ్బంది అని మెడికల్ సర్టిఫికెట్లు చూపించి ఉంటే ఆమె ప్రయాణానికి ఇబ్బంది ఉండకపోయి ఉండేదన్నారు. 'మా నాన్నకి సర్జరీ ఉంది. నేను ఖచ్చితంగా వెళ్లాలి' అంటూ ప్రాదేయపడినా పోలీసులు ఆ మహిళా ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 'మీరు అసలు ఏం చేస్తున్నారు. నా ప్యాంటు కూడా ఊడి పోతోంది(సరి చేసుకుంటూ).. నేను నడవగలను .. దయచేసి నా మీద చేతులు వేయకండి.. నేనొక ప్రొఫెసర్ని' అంటూ ఆ మహిళ చెప్పడం వీడియోలో రికార్డయింది. హాలీవుడ్ సినీ నిర్మాత బిల్ డుమాస్ ఈ తతంగాన్ని మొత్తం తన సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు పోలీసుల తీరుపై త్రీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ మహిళా ప్రొఫెసర్‌పై ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ నిప్పులు చెరిగారు. 'విమానం నుంచి దింపకూడదని ఆమె అధికారులతో చివరివరకు పోరాడింది' అని బిల్ డుమాస్ తెలిపారు. -
మహిళ అని కూడా చూడకుండా..
-
మహిళను విమానం నుంచి తోసేశారు!
అమెరికాలో తల చుట్టు పరదా (హిజాబ్) ధరించిన ఓ ముస్లిం మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి కారణం చెప్పకుండానే ఆమెను విమానం నుంచి బయటకు తోసేశారు. ఆమె ఉండటం వల్ల విమానంలో తమకు అసౌకర్యంగా ఉందని కుంటిసాకుతో సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారు. మేరిలాండ్లో నివాసముండే హకిమా అబ్బుల్లె అనే ముస్లిం మహిళ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో చికాగో నుంచి సీటెల్‌కు బయలుదేరింది. విమానంలో సీటు మార్చుకునే వీలుందా? అని ఆమె సిబ్బందిని అడిగింది. సీటును మార్చడానికి బదులు సిబ్బంది ఆమెనే విమానం నుంచి బయటకు గెంటేశారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇలాంటి ఘటన జరుగడం ఇది రెండోసారి. గత నెలలో ఓ ఇరాకీ వ్యక్తి పట్ల కూడా విమాన సిబ్బంది ఇలాగే వ్యవహరించారు. అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ అధికారి అయిన జైనాబ్ చౌదరి అరబ్బీలో మాట్లాడినందుకు.. ఆయనను విమానం నుంచి బయటకు పంపించారు. హకిమాను విమానం నుంచి బయటకు పంపించడంతో ఎయిర్‌పోర్టు పోలీసులు తిరిగి ఆమెను టికెట్ కౌంటర్ వద్దకు తీసుకొచ్చారు. సోమాలియా మూలాలు ఉన్న ఆమె కొన్ని గంటలపాటు నిరీక్షించిన అనంతరం మరో విమానంలో సీటెల్ చేరుకున్నదని హకిమాను ఉటంకిస్తూ ద బాల్టీమోర్ సన్ పత్రిక తెలిపింది. సరైన కారణమేది చెప్పకుండానే తనను విమానం నుంచి బయటకు పంపించారని, ఇది తనకు బాధ కలిగించిందని ఆమె కన్నీటి పర్యంతమవుతూ హికిమా మీడియాకు తెలిపారు.