
నకిలీ గర్భంతో నటిస్తున్న మహిళ అరెస్టు
తనకు గర్భం ఉన్నట్లు నటించి.. బాంబు దాడులు చేయడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానంతో ఓ మహిళను ఫ్రెంచి పోలీసులు అరెస్టు చేశారు. ఇస్లాం మతంలోకి మారిన ఆ మహిళ (23)తో పాటు ఆమె భర్త (35)ను కూడా అరెస్టు చేశారు. వాళ్ల ఇంటిని సోదా చేసిన పోలీసులకు.. కడుపు ఎత్తుగా కనపడేందుకు ఉపయోగించే దిండు ఒకటి దొరికింది. దాన్ని వాళ్లు ఇంటర్‌నెట్‌లో కొనుగోలు చేసినట్లు తేలింది. అయితే విమానాల్లో ప్రయాణించేటప్పుడు తనకు మంచి సౌకర్యాలు వస్తాయనే ఈ నకిలీ గర్భాన్ని కొన్నట్లు వాళ్లు వాదిస్తున్నారు.
కానీ, దానిమీద అల్యూమినియం ఫాయిల్ కోటింగ్ ఉందని, మెటల్ డిటెక్టర్ల నుంచి కూడా లోపల ఉన్న పదార్థాలు స్కాన్ కాకుండా అది అడ్డుపడుతుందని పోలీసులు అంటున్నారు. అలాంటివి కేవలం బాంబులు దాచడానికే ఉపయోగిస్తారని తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సాగించిన అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆ జంట చూసిందనేందుకు తగిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికి వాళ్లను గృహనిర్బంధంలో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. నవంబర్ 13న జరిగిన ప్యారిస్ ఉగ్రదాడుల్లో 130 మంది మరణించడంతో అప్పటినుంచి ఫ్రాన్స్‌లో హై ఎలర్ట్ ప్రకటించారు.