ఆ ఇంట్లో దెయ్యాలున్నాయ్..! | Woman forced to sell her house after being terrorised by the ghost of a 'SATANIC GOAT' | Sakshi
Sakshi News home page

ఆ ఇంట్లో దెయ్యాలున్నాయ్..!

Published Mon, Feb 1 2016 8:09 PM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

ఆ ఇంట్లో దెయ్యాలున్నాయ్..!

ఆ ఇంట్లో దెయ్యాలున్నాయ్..!

ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న నేటి తరుణంలోనూ...దెయ్యాలూ, భూతాలకు భయపడుతున్నవారు మెండుగానే కనిపిస్తున్నారు. అదీ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అటువంటి నమ్మకాలకు కొదవ లేదు. సైతాన్లు వేధిస్తున్నాయని, దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయని, ఆస్తులు అమ్ముకొనే వారు కొందరైతే...  ప్రాణాలు తీసుకునేవారు మరి కొందరు. అటువంటి ఘటనే తాజాగా బ్రిటన్లో వెలుగు చూడటం అందర్నీ విస్మయ పరుస్తోంది.

ఓ సైతాను తనను గాయపరుస్తోందని, తీవ్రంగా వేధిస్తోందని అందుకే తన ఇల్లు అమ్మకానికి పెట్టానని బ్రిటన్కు చెందిన 43 ఏళ్ళ వెనెస్సా మిచెల్ వెల్లడించింది. అందుకు తనవద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయంటోంది.  ఎస్సెక్స్ సెయింట్ ఓసిత్ లో నివసించే ఆమె... ఏకంగా దెయ్యాల భయంతో స్వంత ఇంటిని అమ్మకానికి పెట్టి కాటేజీకి మారిపోయింది. తన ఇల్లు ఓ భయానక ప్రదేశమని, దెయ్యాలకు, భూతాలకు కేంద్రమని, అనేక సంఘటనలు తాను ఎదుర్కొన్నట్లు  చెప్తోంది.  గర్భిణిగా ఉన్నపుడు దెయ్యం తనను వెనకనుంచీ బలవంతంగా తోసేదని, నేలపై రక్తం చారికలే అందుకు నిదర్శనమని వెనెస్సా సాక్ష్యాలను సైతం చూపిస్తోంది.

తన ఇల్లు మధ్యయుగంలో అధికారిక జైలుగా ఉండేదని, 16వ శతాబ్ద కాలంలో ఇంగ్లాండ్ లోని ప్రసిద్ధ మంత్రగత్తె అక్కడ ఉండేదని, ఎనిమిదిమందిని చంపిందన్న నేరారోపణతో అనంతరం ఆమె చంపబడినట్లు చరిత్ర సాక్ష్యాలున్నాయంటోంది.  అయితే అటువంటి  ఇంట్లో తాను 11 సంవత్సరాల నుంచీ ఉంటున్న వెనెస్పా.. ఇటీవల ఓ మేక రూపంలోని దుష్టశక్తి తన జీవితంలోకి ప్రవేశించిందని అందుకే ఇంటిని  వేలానికి పెట్టానని అంటోంది. మేక ముఖం ఫోటోల్లో కనిపించడమే కాక, సీసీ టీవీ ఫుటేజ్ లో కూడ బయట పడిందని అంటోంది. తనకు... తన కొడుకు మధ్య  నల్లటి ఆకారం నిలబడటం తాను స్వయంగా చూశానంటోంది. మేకలో ఏదో ఆత్మ ప్రవేశించి ఉండొచ్చిని, అదే తమను వేధిస్తోందని వెనెస్సా నమ్ముతోంది.

నిజానికి వెనెస్సా ఆ ఆకర్షణీయమైన ఇంటిని చూసి అప్పట్లో మనసు పారేసుకుందట, గ్రామానికి మధ్యలో, చూసేందుకు ఆకట్టుకునే ఆ ఇల్లు నిజానికి ఎప్పుడూ అమ్మకానికే ఉండేదని.... తాను కొనుగోలు చేసేప్పుడు ఎందరో తనను హెచ్చరించారని అంటోంది. అయితే అప్పట్లో అటువంటి విపరీత ధోరణులను తాను నమ్మకపోవడం వల్లే ఇల్లు కొనుగోలు చేశానని, పదకొండేళ్ళపాటు ఇంట్లో నివసించి అనేక ప్రయోగాలను చేశానని చెప్తోంది. ఇల్లు కట్టినప్పటినుంచీ ఎవ్వరూ ఆర్నెల్లకు మించి అందులో నివసించలేదని  ఆమె తెలుసుకుంది.

వందేళ్ళ క్రితం ఓ కుటుంబం 150 యూరోలకు ఈ ఇంటిని కొనుగోలు చేసి, కొంతకాలం తర్వాత దాన్ని వదిలించుకొనేందుకు కేవలం 50 యూరోలకే విక్రయించినట్లు తెలిసిందంటోంది. ప్రస్తుతం తానుకూడా ఇంటిని అమ్మకానికి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ ఇంట్లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నట్లు ఎన్నో నిదర్శనాలు తనకు కనిపించాయని చెప్తోంది. 2004 లో 148 యూరోలకు ఆ ఇంటిని కొనుగోలు చేసిన వెనెస్సా... దానికి దెయ్యాల చరిత్ర ఉందని గ్రహించలేకపోయానంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement