
పార్క్‌లో భారతీయ కుటుంబానికి అవమానం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారతీయులపై మరో జాతి వివక్ష సంఘటన చోటుచేసుకుంది. గర్భవతి అయిన తన భార్యను కాస్తంత పక్కన కూర్చొబెట్టుకుంటారా అని అడిగినందుకు ఉత్సవ్ పటేల్ అనే భారతీయుడు, అతడి కుటుంబానికి సిడ్నీలో చేదు అనుభవం ఎదురైంది. ఆ సిడ్నీ మహిళ అతడిని, భారతీయులను, భారత్‌ను అనకూడని మాటలతో ద్వేషించింది. వారి నాలుగేళ్ల కూతురు భయంతో చూస్తుండగా జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసింది. దీనిని ఉత్సవ్ తన కెమెరాలో రికార్డు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ఘటన ఏప్రిల్ 22న సిడ్నీలోని లూనా పార్క్‌లో చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. ఉత్సవ్ తెలిపిన వివరాల ప్రకారం పార్క్‌లో రైడింగ్ చేసేందుకు తన నాలుగేళ్ల కూతురు గర్భవతి అయిన భార్యతో కలసి వెళ్లాడు. అయితే, తన భార్య గర్భవతి కావడంతో కొద్ది సేపు వాకింగ్ చేసి తర్వాత అతడు రైడింగ్‌కు వెళ్లొచ్చేవరకు ఒక బెంచిపై కూర్చొబెట్టాలని అనుకున్నాడు. అప్పటికే దానిపై ఓ ఆస్ట్రేలియన్ మహిళ ఉండటంతో ఆమెను కాస్తంత కూర్చొబెట్టుకుంటారా అని అడిగినందుకు ఆమె అనకూడని మాటలు అనేసింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. గో..గో..గో అంటో గోల చేసింది. తనకు భారతీయులంటే అస్సలు ఇష్టం లేదంటూ గట్టిగా అరిచింది. దీనిపై విచారణ వేగంగా సాగుతోంది.