గన్ ఆకారం హీల్స్ వేసుకున్నందుకు...
వాషింగ్టన్ః తుపాకీ హీల్స్ ధరించి, బుల్లెట్ బ్రాస్లెట్లను బ్యాగ్ లో తీసుకెడుతున్న అమ్మాయికి అమెరికా ఎయిర్ పోర్టు అధికారులు అభ్యంతరాలు తెలిపారు. చూసేందుకు అచ్చం బులెట్లలా ఉన్నరెండు బ్రాస్టెట్లను బ్యాగ్ లో పెట్టుకొని, నిజం తుపాకీల్లా ఉన్నహై హీల్స్ ధరించడమే ఆమె ప్రయాణానికి అడ్డంకిగా మారింది. ప్రమాదకర వస్తువులతో ప్రయాణమైనట్లు అనుమానించిన ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అక్కడే నిలిపేశారు.
అభ్యంతర కర వస్తువులతో ఆమె ట్రావెల్ చేయడంతో ఎంతో సమయం వృధా అయ్యిందని బాల్టిమోర్ వాషిగ్టన్ ఎయిర్ పోర్టు ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సభ్యురాలు లిసా ఫార్బెస్టన్ తెలిపారు. ఏజెంట్లు ఆమెవద్ద ప్రమాదకర వస్తువులున్నాయని గుర్గించారని, అందుకే ప్రత్యేక తనిఖీలు చేపట్టాల్సివచ్చిందని ఆమె అన్నారు. షూస్, బ్రాస్లెట్లు ధరించడం అభ్యంతరం కాదని, అయితే ఆయుధాలు, మందుగుండు సామగ్రి వంటివి తీసుకొని ప్రయాణించేందుకు టీఎస్ఏ అనుమతి ఉండదని ఆమె ఓ ట్వీట్లో తెలిపారు. అయితే ఆమె ఆ వస్తువులు చెక్ పాయింట్ దగ్గర చెక్డ్ బ్యాగ్ లో పెట్టుకున్నారని అనంతరం నియమాలకు విరుద్ధంగా బోర్డింగ్ సమయంలో వాటిని తీసి ధరించారని ఫార్బెస్టన్ తెలిపారు. కాగా ఆమెపై ఎటువంటి కేసులు పెట్టలేదని బాల్టిమోర్ సీబీఎస్ నివేదించింది.
ప్రస్తుతం టీఎస్ఏ ఏజెంట్లకు తన బూట్లను అప్పగించి వెళ్ళిన యజమాని అడ్రస్ కోసం షూ తయారీదారుడు ఎదురు చూస్తున్నాడు. తన బూట్లను ఎయిర్ పోర్టులో వదిలి వెళ్ళిన మహిళకోసం శోధిస్తున్నట్లు ప్లెజర్ యుఎస్ఏ షూ కంపెనీ యజమానులు తమ కంపెనీ ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. దయచేసి తమను సంప్రదించాలని, తమ కారణంగా విమానం తప్పిపోయిన మహిళకు మరో బాండ్ గర్ల్ బూట్ల జతను ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు.