ముసలోళ్ల కంటే ముసలమ్మలే నయం!
వార్ధక్యం వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోవడం, కళ్లజోడు నెత్తిమీద పెట్టుకుని దానికోసం ఊరంతా వెతుక్కోవడం.. ఇలాంటివన్నీ సర్వసాధారణం. అయితే, వయసు మీద పడ్డ తర్వాత కూడా మగాళ్ల కంటే ఆడాళ్ల మెదడు కొంత మెరుగ్గా పనిచేస్తుందట. ఈ విషయం తాజా సర్వేలో తేలింది. గడిచిన 20 ఏళ్లలో ఆడవాళ్ల సగటు జీవితకాలం బాగానే పెరిగింది. కానీ వాళ్లకు మాత్రం మతిమరుపు లాంటి సమస్యలు అంత ఎక్కువగా ఏమీ రావట్లేదట. మగాళ్ల విషయం మాత్రం అలా లేదు. కొంచెం వయసు మీద పడినప్పటి నుంచి వాళ్లలో మతిమరుపు అలా అలా.. వచ్చేస్తోందట. ఇలా ఎందుకు జరుగుతోందన్న దానికి కారణాలు దొరకట్లేదు గానీ.. జరగడం మాత్రం వాస్తవమని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. బహుశా మహిళలకు విద్యావకాశాలు పెరగడం లాంటివి కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయేమోనని అంటున్నారు.
సంక్లిష్ట విషయాల గురించి ఆలోచిస్తూ మెదడును ఎక్కువగా ఉపయోగించేవాళ్లకు డిమెన్షియా లాంటి సమస్యలు రావడం తక్కువని, మహిళలు ఇటీవలి కాలంలో యూనివర్సిటీలకు ఎక్కువగా వెళ్తుండటంతో.. వాళ్లకు డిమెన్షియా వచ్చే అవకాశాలు కూడా తగ్గుతున్నాయని చెబుతున్నారు. న్యూకేజిల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలు ఈ అంశంపై పరిశోధన చేశాయి. వాళ్ల పరిశోధనలో కూడా మహిళలు ఎక్కువ కాలం పాటు తెలివితేటలు కలిగి ఉంటారని, పురుషులు మాత్రం శారీకంగాను, మానసికంగాను త్వరగా అలసిపోతున్నారని చెప్పారు.
రెండు దశాబ్దాల క్రితం పురుషులు దాదాపు 75.3 ఏళ్ల వయసు వరకు ఎలాంటి శారీరక సమస్యలు లేకుండా ఫిట్‌గా ఉంటుండగా, మహిళలు 76 ఏళ్ల వరకు అలా ఉండేవారు. అదే ఇప్పుడు మాత్రం పురుషులు 77.9 ఏళ్ల వరకు, మహిళలు 76.5 ఏళ్ల వరకు ఫిట్‌గా ఉంటున్నారట. మహిళల్లో ఊబకాయం ఇటీవల కొంత ఎక్కువవుతోందని, అందువల్ల వారికి ఈ తరహా శారీరక సమస్యలు వస్తున్నాయని ప్రొఫెసర్ జాగర్ చెప్పారు.