బీజింగ్ : చైనాను నిరవధికంగా పాలించాలన్న అధ్యక్షుడు జింగ్ పింగ్ ఆలోచనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన పాలనలో చైనా మరో ఉత్తర కొరియాలా మారుతుందన్న ఆందోళనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు గల కారణాలను వివవరిస్తున్న విశ్లేషకులు మున్ముందు ఆ నిర్ణయం చైనాకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
2013లో మార్చి 14న 64 ఏళ్ల జింగ్ పింగ్ తొలి దఫా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఈ మార్చితో ఆయన పదవీకాలం ముగియబోతోంది. చైనా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించేందుకు అర్హుడు. కానీ, జీ జిన్‌పింగ్ మాత్రం ఆ నిబంధనను సవరించేదిశగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నిరవధికంగా కొనసాగేలా పార్టీ కేంద్ర కమిటీ ఓ కీలక ప్రతిపాదన చేసింది. త్వరలో దానికి పార్లమెంట్ అధికారిక ముద్ర కూడా వేయబోతోంది.
గతేడాది అక్టోబర్‌లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ ప్రతిపాదనను పార్లమెంట్ ఆమోదించింది. లీకుల ద్వారా ఆ విషయం బయటికి పొక్కటంతో విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆయన పదవీ కాలం దగ్గరపడుతుండటం, ఆ ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించేందుకు పావులు కదుపుతుండటంతో విమర్శకులు, విశ్లేషకులు రంగంలోకి దిగిపోయారు.
జింగ్ పాలనను విశ్లేషిస్తే...
నిజానికి జింగ్ పింగ్‌కు పాలనపరంగా తొలినాళ్లలో మంచి మార్కులే పడ్డాయి. అయితే రాను రాను అవినీతి పెరిగిపోవటం.. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోలేకపోవటం... మరీ ముఖ్యంగా పొరుగు దేశాలతో సఖ్యత విషయంలో ఆయన తీరు మూలంగా విమర్శలు మొదలయ్యాయి. దీనికి తోడు దక్షిణ, తూర్పు చైనాల వెంబడి సముద్ర తీరాల సరిహద్దు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఉత్తర కొరియా, పాకిస్తాన్ విషయంలో సానుకూల ధోరణిని పాటించటం అంతర్జాతీయ సమాజంలో చైనా పట్ల వ్యతిరేకతను పెంపొందించేలా చేశాయన్నది మరో వాదన.
వర్తక, వ్యాపారాల విషయంలో కఠినవైఖరి అవలంభిస్తుండటంతో ఆదాయ గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏకఛత్రాధిపత్య పాలనలో చైనా అభివృద్ధిని కుంటుపరిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ఏకఛత్రాధిపత్య పాలనలో చైనా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితులను వారు గుర్తు చేస్తున్నారు.
రాజకీయపరంగా విమర్శలు...
మరోవైపు రాజకీయపరంగా కూడా విమర్శలు తారాస్థాయికి చేరాయి. మిగతా పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండటంతో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మావో మాదిరిగా ఎక్కువ కాలం చైనాను పాలించాలని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక తాజా చట్టం అమలులోకి వస్తే గనుక కీలక నిర్ణయాల విషయంలో మద్ధతు ప్రస్తావనే ఉండదు. అధికారమంతా ఆయన ఒక్కడి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అదే జరిగితే జింగ్‌పింగ్ నియంత పాలన కొనసాగించటం ఖాయమని.. మరో ఉత్తర కొరియాలా మారిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పార్లమెంట్‌లో అధికార పార్టీలో ఆయన మద్ధతుదారులే ఎక్కువగా ఉన్నారు. మెజార్టీ మద్ధతు ఉండటంతో చట్టం కార్యరూపం దాల్చేందుకు అడ్డంకులేం లేకుండా పోయాయి. దీంతో జింగ్ నిరవధిక పాలనకు లైన్ క్లియర్ అయినట్లేనని అర్థమౌతోంది.
సోషల్ మీడియాలో ..
మరో పక్క సోషల్ మీడియాలో జింగ్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మెమెలతో, పోస్టులతో విరుచుకుపడుతున్నారు. చైనా అధికారిక సోషల్ మీడియా వెబో అయితే మొత్తం జింగ్ పింగ్‌వ్యతిరేక పోస్టులతో నిండిపోవటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment