
బీజింగ్ : చైనాకు తిరుగులేని నేతగా జీ జిన్‌పింగ్ అవతరించారు. రెండోసారి కూడా ఆయన చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తమ దేశ రాజ్యాంగంలో ఉన్న కాల పరిమితి నిబంధనను పూర్తిగా తొలగించి మరీ జీ జిన్‌పింగ్‌కు ఈ బాధ్యతలు కట్టబెట్టారు. చైనా అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తికి కాలపరిమితిని తొలగిస్తూ చైనా పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాని ద్వారా జీ జిన్‌పింగ్ 2023 తరువాత కూడా చైనా అధ్యక్షుడిగా ఉండడానికి అధికారికంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలిగినట్లయింది.
అంతేకాదు.. మున్ముందు కూడా చైనా జీజిన్‌పింగ్‌నే శాశ్వతంగా కొనసాగించాలని భావిస్తోంది. చైనాకు రెండోసారి ఐదేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగనున్న ఆయన అత్యంత శక్తిమంతమైన చైనా సెంట్రల మిలటరీ కమిషన్‌కు అత్యున్నతాధికారిగా కూడా వ్యవహరించనున్నారు. ఈ నెల (మార్చి) 11న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కు చెందిన 2900 మంది డిప్యూటీలంతా కలసి రాజ్యాంగ సవరణకు ఓటు వేసి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి కాలపరిమితి నిబంధనను తొలగించారు. ఆ దేశంలో ఉన్న ఏకైక పెద్ద పార్టీ కమ్యునిస్టు పార్టీ ఆఫ్ చైనా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జీవితాంతం చైనా అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. 1982లో డెంగ్ జియావోపింగ్ కాలంలో.. అప్పటి ప్రభుత్వం ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలని చట్టం చేసింది. ఆ తరువాత మళ్లీ 36 ఏళ్లకు రాజ్యాంగ సవరణ చేశారు.