ఓ వ్యక్తి @ 25 వేల సెల్ఫీలు
లండన్: ఓ వ్యక్తి తన జీవితంలో ఎన్ని సెల్ఫీలు తీసుకోవచ్చు..? 1980 తర్వాత జన్మించిన వారు ముసలివాళ్లు అయ్యే వరకు సెల్ఫీలు తీసుకుంటే ఎన్ని సేకరించవచ్చు..? ఓ పరిశోధన ప్రకారం ఒక్కొక్కరు తమ జీవితకాలంలో సగటున 25 వేలకు పైగా సెల్ఫీలను తీసుకోవచ్చు..! 'లస్టర్ ప్రీమియం వైట్' నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
సెల్ఫీల సరదా ఉన్నవారు తమ జీవితంలో సరాసరిన 25,676 సెల్ఫీలు తీసుకుంటారని అంచనా వేసింది. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్లో ఎకౌంట్లు ఉన్నవారికి సెల్ఫీల సరదా ఎక్కువ ఉందని వెల్లడించింది. 1000 మంది అమెరికన్లు సర్వే చేయగా.. ఏదైనా వేడుక లేదా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి గడిపిన సందర్భంగా సెల్ఫీలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇక 63 శాతం మంది సెల్ఫీలు తీసుకోవడానికి విహార యాత్ర అనువైన ప్రదేశమని అభిప్రాయపడ్డారు. సగంమంది సెల్ఫీలు తీసుకునేముందు జట్టును సవరించుకుంటామని తెలిపారు. మరో 53 శాతం మంది సెల్ఫీ దిగేముందు అద్దంతో తమ ముఖం చూసుకుంటామని చెప్పారు. 47 శాతం సెల్పీలకు ముందు ముఖకవళికలను ప్రాక్టీస్ చేస్తామని వెల్లడించారు. 95 శాతం మంది కనీసం ఒక్క సెల్పీ అయినా తీసుకున్నారని ఆ సర్వేలో తేలింది.