
వాషింగ్టన్: చిన్నారుల వ్యక్తిగత డేటాను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా చోరి చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ కుచెందిన వీడియో సైట్ యూ ట్యూబ్‌కు భారీ షాక్ తక్‌గిలింది. ప్రకటనల కోసం 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారనే ఆరోపణతో గూగుల్ సంస్థ రూ.1200 కోట్లకు పైగా జరిమానా చెల్లించాలని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ న్యూయార్క్ కోర్టులో కేసు వేసింది. ఈ ఆరోపణలపై న్యూయార్క్ స్టేట్ అటార్నీ జనరల్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారణ అనంతరం వ్యాపార ప్రయోజనాల కోసం వీటిని వినియోగించిందనే వాదనపై సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు గూగుల్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు 136 మిలియన్ డాలర్లు, న్యూయార్క్ స్టేట్‌కు 34 మిలియన్ డాలర్లు మొత్తం 170 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఎఫ్‌టీసీ చైర్మన్ జో సైమన్స్ ప్రకటించారు.
గోప్యత ఉల్లంఘనల ఆరోపణపై ఫేస్‌బుక్‌పై ఈ ఏడాది ఎఫ్‌టీసీ విధించిన 5 బిలియన్ డాలర్ల జరిమానాతో పోల్చితే ఇది అతిపెద్ద జరిమానా. అయితే యూట్యూబ్‌కు ఎఫ్‌టీసీ విధించిన జరిమానాను వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టు ఆమోదించాల్సివుంది. మరోవైపు గోప్యతా ఉల్లంఘనల ఆరోపణలతో గూగుల్‌ను జరిమానా విధించడం 2011 నుండి మూడవసారి అని, తాజా ఉల్లంఘన చాలా తీవ్రమైందని డెమొక్రాట్ కమిషనర్ రోహిత్ చోప్రా పేర్కొన్నారు.
కాగా గూగుల్ సంస్థపై అనేక సందర్భాల్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అపహరించినట్టు ఆరోపణలున్నాయి. తాజాగా వ్యవహారంలో కూడా గోప్యతకు సంబంధించిన విషయంలో గూగుల్ సంస్థ విఫలమైందని యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆరోపించింది. గతేడాది గూగుల్ సంస్థ డిజిటల్ ప్రకటనల ద్వారా రూ.8 లక్షల కోట్లకు పైగా అర్జించిందనే ఆరోపణలూ ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment