ట్రంప్ కావాలా.. అణుయుద్ధం కావాలా?
వచ్చే నెలలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌నే ఎన్నుకోవాలని.. లేనిపక్షంలో అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహిత సహచరుడు ఒకరు హెచ్చరించారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలుచేస్తూ.. రష్యన్ ట్రంప్‌గా పేరొందిన వ్లాదిమిర్ జిరినొవ్‌స్కీ రాయిటర్స్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. మాస్కోకు.. వాషింగ్టన్‌కు మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించగల ఏకైక వ్యక్తి ట్రంప్ మాత్రమేనని ఆయన తెలిపారు. అదే హిల్లరీ క్లింటన్ ఎన్నికైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చని జిరినొవ్‌స్కీ హెచ్చరించారు. గత నెలలో జరిగిన రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో జిరినొవ్‌స్కీ ప్రాతినిధ్యం వహించే లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ రష్యా మూడోస్థానంలో నిలిచింది.
అయితే రష్యాలో చాలామంది ఆయనను ఒక జోకర్‌లా భావిస్తుంటారు. అందరి దృష్టి తనమీద పడాలన్న ఉద్దేశంతో ఆయన ప్రతి అంశం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. క్రెమ్లిన్ విధానాలకు బాగా కట్టుబడి ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి ఒక్కోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు ఇప్పటి కంటే దారుణంగా అయ్యేందుకు అవకాశం లేదని.. యుద్ధం మొదలైతేనే అవి మరింత క్షీణిస్తాయని జిరినొవ్‌స్కీ అన్నారు. భూగ్రహం మీద శాంతి ఉండాలంటే అమెరికన్లు ట్రంప్‌కే ఓటు వేయాలని, కానీ వాళ్లు హిల్లరీని ఎన్నుకుంటే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం.. అది కూడా అణుయుద్ధం తప్పదని చెప్పారు. ప్రతిచోటా హిరోషిమా, నాగసాకిలే కనపడతాయని హెచ్చరించారు.