కెమెరా, ఆడియోజాక్ లపై టేప్ అంటించిన జుకర్ బర్గ్..
లక్షలమంది వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఓ హాస్యాస్పద ఫోటోను పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో ఆయన మ్యాక్ బుక్ పై కెమెరా, ఆడియో జాక్ లను టేప్ తో కవర్ చేయడం కనిపించింది. తన సామాజిక ఖాతాల పాస్వర్డ్ లు హ్యాక్ అయిన తర్వాత ఆయన మ్యాక్ బుక్ కెమెరా, ఆడియో జాక్ లపై టేప్ అటించినట్లు కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
సోషల్ మీడియా సైట్లతోపాటు, నెట్ బ్యాంకింగ్ ఖాతాలు ఇటీవల హ్యాకర్ల చేతుల్లోకి వెడుతున్నాయని సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అటువంటి బాధితుల జాబితాలో సామాన్యులే కాక, ఏకంగా ప్రపంచ దిగ్గజాలు కూడ ఉంటున్నారు. అదే విషయంలో సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్ బర్గ కూడ నిర్లక్ష్యం వహించి తన ట్విట్టర్, పింటరెస్ట్ ఖాతాలకు ఒకేరకమైన పాస్వర్డ్ పెట్టడంతో ఆయన ఖాతాలుసైతం హ్యాక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇన్ స్టాగ్రామ్ నెలవారీ వినియోగదారులు 500 మిలియన్లు దాటిన సంతోషకర సందర్భంలో జుకర్ బర్గ్ ఓ హాస్యాస్పద చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ చిత్రంలో జుకర్ బర్గ్ చేతిలో ఓ చెక్క ఫ్రేమ్ పట్టుకొని ఉండగా, ఆయన వెనుక ఆయన ల్యాప్ ట్యాప్ కనిపిస్తుంది. ఆ సన్నివేశం చూస్తే ఆయనేదో సందేశం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాగా ఆ ఫోటోను పరీక్షగా చూసిన ట్విట్టర్ వినియోగదారుడు క్రిస్ ఓల్సెన్.. జుకర్ బర్గ్ ల్యాప్ టాప్ కెమెరాను, టేప్ ప్ తో కవర్ చేశారంటూ కామెంట్ చేశాడు. అధునాతన హ్యాకర్లు కెమెరాద్వారా ల్యాప్ టాప్ ను నియంత్రిస్తారు. అందుకే జుకర్ బర్గ్ ఆయన మ్యాక్ బుక్ కెమెరా, ఆడియోజాక్ లను టేప్ తో చుట్టేశారంటూ మరో వినియోగదారుడు గిజ్మోడో తన కామెంట్లో జుకర్ బర్గ్ పై ఛలోక్తి విసిరాడు.
ముఖ్యంగా వినియోగదారుల ప్రైవేట్ సంభాషణలు, ప్రైవసీని కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన ఫేస్ బుక్ సీఈవో.. ఇలా తన ప్రైవసీని కాపాడుకోవడానికి పడుతున్నతాపత్రయం అందరికీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. జుకర్ బర్గ్ తన వెబ్ క్యామ్ కు కూడ టేప్ వేసి ఉంచినట్లు తాను ఇదివరకే ఓ సందర్శంలో గమనించాని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ చెప్తుండగా...కొన్నేళ్ళ క్రితంనుంచే ఆమెరికా ప్రభుత్వం సీక్రెట్ గా తమ పౌరులను వెబ్ క్యామ్ ల ద్వారా పరిశీలిస్తోందని క్వాంటికోలోని ఎఫ్ బీ ఐ ఆపరేషనల్ టెక్నాలజీ డివిజన్ లో మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మార్కస్ థామస్ చెప్తున్నారు. సో... తనదాకా వస్తే కానీ అన్న సామెత ఇక్కడ జుకర్ బర్గ్ కు కూడ వర్తింస్తోందన్న మాట.