కొమ్మినేని శ్రీనివాసరావుతో ఐవైఆర్ కృష్ణారావు
కొమ్మినేని శ్రీనివాసరావుతో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు
రాష్ట్రంలోని మూడు విభిన్న ప్రాంతాల ఆమోదం పొందేలా చైతన్యవంతంగా ప్రయత్నాలు చేయకపోతే అమరావతి ప్రజారాజధాని అయ్యే అవకాశాలు లేవని విభజనానంతర ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కుండబద్దలు కొట్టారు. రాజధాని గురించి ప్రశ్నిస్తేనే రాష్ట్ర ద్రోహివి అంటూ ఎదురు దాడులకు దిగితే పరిష్కారం లభించదని, ఒక నిర్దిష్ట వర్గం తప్పితే మిగతా సామాజిక వర్గాలేవీ అమరావతిని ఎందుకు తమ సొంతం చేసుకోలేదనే అంశంపై ప్రభుత్వం, పాలకులు ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆలోచనలు, నిర్ణయాలూ వాస్తవికతా ప్రాతిపదికన జరిగి ఉంటే విభజన చట్టంలో పొందుపర్చిన అధికారిక భవనాలన్నీ కేంద్రం ఇచ్చిన రూ. 2,500 కోట్లతో ఇప్పటికే కట్టేసి ఉండవచ్చు కానీ లక్షకోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మాణం అనే భ్రమల్లో మునిగితేలుతున్నందువల్లే అక్కడ నాలుగేళ్ల తర్వాత కూడా ఒక శాశ్వత నిర్మాణమూ చోటు చేసుకోలేదన్నారు. తటస్థత, ఉమ్మడి అభిప్రాయం పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలిచిన అమరావతి నిర్మాణం భవిష్యత్తులో పలు సమస్యలను ఎదుర్కోక తప్పదంటున్న ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకం రాశారు. ఎవరి రాజధానిగా ఉంది?
పుస్తకం శీర్షికలోనే ప్రశ్నను వదిలాను కదా. కొన్ని ప్రధాన అంశాలను ఆ పుస్తకంలో లేవనెత్తాను. వాటిపై చర్చ జరగాలన్నది నా అభిమతం. ఆ శీర్షికే సమాధానాన్ని సూచిస్తోంది. ఏ అంశంమీదైనా దాని నేపథ్యం తెలిసినవాళ్లు మాట్లాడితే అది మంచి ట్రెండ్‌ని సెట్ చేస్తుంది అనే ఉద్దేశంతో రాశాను.
అమరావతిపై మీకున్న ప్రధానమైన అభ్యంతరం ఏమిటి?
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, పాలనాపరంగా ఏకీకృత స్వభావంతో ఉంటుంది. అదే ఆంధ్రరాష్ట్రం విభిన్నత్వం ఉండే ప్రదేశం. ఆంధ్రలో ఎవరు రాష్ట్ర పాలన చేసినా ఈ వైవిధ్యతను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంలో రాష్ట్రానికి ఇబ్బంది అని నా ఆలోచన. రాజధాని ప్రాంతంతో సహా అన్ని విషయాల్లో దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ప్రక్రియను అనుసరించకుండా 2014లో నిర్ణయం తీసుకున్నారు. ప్రక్రియ అంటే ఇక్కడ విస్తృత స్థాయి చర్చ, దాంట్లో చాలామందిని భాగస్వామ్యులను చేయడం, ఈ వ్యత్యాసాలను చైతన్యవంతంగా పరిష్కరించే క్రమంలో వెళ్లడం. ఆ క్రమం జరగలేదు. రాజధానిగా ఈ ప్రదేశం సరైనదా కాదా అనే సాంకేతిక పరిశీలన అసలు చేయలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది. దేశంలో, ప్రపంచంలో వివిధ రాజధానుల నిర్మాణాలను, వారి అనుభవాలను పరిశీలించినప్పుడు వాటితో పోల్చుకుంటే ఏపీ రాజధానికి సంబంధించి ఈరోజు జరుగుతున్న తప్పులు ఎలాంటి పరిణామాలకు దారితీయవచ్చు అనే చట్రాన్ని పెట్టుకుని అధ్యయనం చేశాను.
థియరీ ప్రకారం రాజధానికి సంబంధించి కొన్ని పాజిటివ్, కొన్ని నెగటివ్ అంశాలున్నాయి. వెనుకబడిన ప్రాంతాల్లో రాజధాని ఏర్పర్చాలని అంతర్జాతీయ అనుభవం చెబుతోంది. ఆ రకంగా చూస్తే రాయలసీమలో రాజధాని పెట్టడం చాలా సబబుగా ఉండేది. ఇక నెగటివ్ అంశం ఏదంటే మన తెగ ఉన్న చోటే రాజధాని పెట్టుకోవాలనుకోవడం. వాళ్లకే పరిమితమై. మిగిలినవాళ్లతో సంబంధం లేకుండా ఉండే రాజధాని పెట్టుకోవాలనుకోవడం. ఇలాంటి వాటికి దీర్ఘకాలంలో మనుగడ తక్కువ. దీని ప్రకారం అమరావతి తటస్థ రాజధాని కాదు. చర్చ జరిగి ఏకాభిప్రాయం కుదిరి, అన్ని ప్రాంతాల అంగీకారంతో ఏర్పడిన రాజ ధాని కాదు అమరావతి. అందుకే ఇది తటస్థ రాజధాని కాదు.
అమరావతి రాజధానిగా ఉండటంలో అభ్యంతరాలేమిటి?
సానుకూల అంశాల ప్రాతిపదికన అమరావతిని రాజధానిగా ఎన్నుకున్నట్లు కనపడదు. కాగా.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధానిని పెట్టవద్దని ఎవరూ అనటం లేదు. విశాల దృక్పథంతో చర్చించి పెట్టవచ్చు. కానీ కీలకమైన అంశం ఏదంటే, స్టడీ చేయకుండా దేశంలో ఏర్పాటు చేసిన ఒకే ఒక రాజధాని అమరావతి. ఆఫ్రికా ఖండంలో తమ జాతి, తమ తెగ ఉన్నచోట రాజధానిని పెట్టుకుని వారే లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లే అమరావతి విషయంలో కూడా జరిగిందని ఒక సంశయం.
అంటే ఒక సామాజిక వర్గానికి ఎక్కువ లాభం చేకూరేలా పెట్టారనా?
అవును. ఒక వర్గానికే ఎక్కువ ప్రయోజనం వచ్చేలా చూసుకున్నారు.
అంటే కమ్మ కులానికి అధిక లాభం చేకూరేలా చేశారనేనా మీరంటున్నారు?
అంత దూరం పోవలసిన అవసరమేంటి? ప్రజలు అర్థం చేసుకుంటారు కదా.
రాజధాని అంశంలో చాలా కుంభకోణం జరిగిందని వైఎస్సార్‌సీపీ ఆరోపణ?
ఈ ఆరోపణల లోతులోకి నేను వెళ్లను కానీ అప్పటికే రియల్ ఎస్టేట్, వాణిజ్య ప్రయోజనం ఏర్పడి ఉన్న చోటే రాజధానిని పెట్టారని చెప్పగలను. ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి అదే కారణమని చెప్పవచ్చు.
రైతులు పూలింగ్ కింద భూమిని ఎలా ఇచ్చారు? వారికి లాభం జరిగిందా?
నిర్దిష్టంగా స్టడీ చేసి మిగిలిన ప్రాంతాల్లో దీని ప్రభావాలు ఎలా ఉంటాయన్నది పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలకు వస్తే దీర్ఘకాలంలో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేదానికి అమరావతి ఒక ఉదాహరణ. దేశంలో ఒక గుజరాత్‌లోనే ల్యాండ్ పూలింగ్ విజయవంతంగా జరిగింది. గుజరాత్‌లో జరిగిన భూ సేకరణ అంతా చిన్న చిన్న ఏరియాల్లో అంటే వంద ఎకరాల లోపు స్థలాల్లో మాత్రమే చేశారు. అది కూడా పట్టణ ప్రాంతాల్లోనే చేశారు. మౌలిక వసతులు పెంచితే మీ భూములకూ విలువ పెరుగుతుందని చిన్న చిన్న ప్రదేశాల్లో ఉన్నవారికి నచ్చచెప్పడమే కాకుండా వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. ఈ ప్రయోగాన్ని గుజరాత్‌లో మరొక చోట పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేశారు. బొంబాయి–ఢిల్లీ పారిశ్రామిక కారిడార్‌లో ఒకరోడ్డు అభివృద్ధి చేయడానికి 20, 30 వేల ఎకరాల భూమిని పూలింగ్ కింద తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశారు. 2006 నుంచి 2016 వరకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. పూర్తిగా విఫలమైంది.
మరి ఏపీలో 30 వేల ఎకరాల పూలింగ్ చేసేశామని చెప్పుకున్నారు కదా?
రామచంద్రయ్య గారు ఈ అంశంపై ఈపీడబ్ల్యూలో నిర్ధిష్టంగా రెండు వ్యాసాలు కూడా రాశారు. ల్యాండ్ పూలింగ్ ఎలా జరిగిందో ఆయన వివరించారు. పెద్దపెద్ద రైతులు, ఎవరి పిల్లలైతే అమెరికాలోనో మరే దేశంలోనో సెటిలై ఉన్నారో, ఇక మళ్లీ వ్యవసాయానికి తిరిగి రారు అని నిర్ధారించుకున్నారో అలాంటి వారిని అందరినీ కో ఆప్ట్ చేసుకున్నారు. మీరు భూములు గనుక ఇస్తే ఇంత విలువకు పెరిగిపోతాయని, కోటీశ్వరులైపోతారని భ్రమల్లో పెట్టి తీసుకున్నారు. అలా దారికి రానివారిని కాస్త భయపెట్టడం కూడా జరి గింది. ఇబ్బంది పెట్టారు. పంటలు తగులబెట్టారు. ఇవన్నీ రామచంద్రయ్య గారు క్షేత్ర పరిశోధన ద్వారా తెలుసుకుని చెప్పిన అంశాలు. దీనంతటికీ నేపథ్యం ల్యాండ్ ఆక్యుపేషన్. నువ్వు గనుక పూలింగ్‌లో భాగంగా భూమి ఇవ్వకపోతే, నీ భూమిని ఆక్రమించేస్తాం అని బెదిరించడం అన్నమాట. 32 వేల ఎకరాలను ఆ ఏరియాలో భూసేకరణ చేయాలంటే అంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు. కానీ ఆ భూ సేకరణ అనే కత్తిని చూపించి పని జరిపించేశారు. పైగా మీరు భూములు ఇవ్వకపోతే అవి గ్రీన్ బెల్ట్ కింద పోతాయి అని భయపెట్టారు కూడా. అయినా సరే కొంతమంది రైతులు తమ భూములు ఇవ్వలేదు. ఇంకా పోరాడుతూ ఉన్నారు. ఏదేమైనా ఎక్కువ మంది ఇచ్చేశారు. పూలింగ్ వరకు అయింది.
ఏపీలో జరిగిన భూ సేకరణ దేనికి?
రాజధాని కోసం కాదు. మహానగరం నిర్మాణానికి తీసుకున్నారు. మహానగరం తక్షణం నిర్మించడం సాధ్యమా? సాధ్యం కానప్పుడు, ఇంత భూమిని సేకరించారు కనుక తన భూమికి ఎంత వస్తుందనే అంచనాలు రైతులు కలిగి ఉంటారు. వారి భూములకు విలువ రావాలంటే అంత మేరకు ఆర్థిక కార్యాచరణ జరగాలి. అది కూడా అతితక్కువ కాలంలో రావాలి. కానీ అది 50 ఏళ్లకు వస్తుంది. కానీ తక్కువ సమయంలో 32 వేల ఎకరాల భూమిలో అంత అధికంగా ఆర్థిక కార్యాచరణ తీసుకురావడం సాధ్యపడే విషయం కాదు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పరిపాలనా రాజధానిని కట్టి దాన్ని మహానగరంగా పరిణతి చెందడానికి వదిలేయడం ఒక ఐచ్ఛికం. రెండు మూడేళ్లలో మహానగరం కావాలని అనుకోవడం సరైన మోడల్ కాదు. కట్టాలి అనే ఆశావాదం మంచిదే కానీ అది వాస్తవికంగా ఉండటం అవసరం.
లక్షకోట్లతో రాజధాని అని బాబు చెప్పడం జనాల్ని మోసం చేయడం కాదా?
కేంద్ర వార్షిక బడ్డెట్ 22 లక్షల కోట్లు. దీంట్లో లక్ష కోట్లు అంటే దాదాపు 5 శాతం. ఒక రాష్ట్రానికి కాదు ఒక రాజధానికి లక్ష కోట్లు ఇస్తారనుకోవడం రియలిస్టిక్ కాదు. ఎన్నికల మ్యానిఫెస్టోను, వాగ్దానాలను ఆధారంగా చేసుకుని ఫలితాలను అంచనా వేసుకోవడం తప్పు. భారత ప్రభుత్వం ఇవ్వాళ ఏపీ రాజధానిపైన వాస్తవ ప్రాతిపదికనే స్పందిస్తోంది. మోదీ సమాధానం చెప్పాలన్నది కరెక్టే. కానీ ఎంత వస్తుంది, ఎంత ఇస్తుంది అనేది వాస్తవికంగా ఉండాలి. చట్టంలో ఏదయితే ఉందో ఆ మేరకే కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి రాదు. లక్షకోట్ల రాజధాని అసలు సాధ్యమే కాదు.
కేంద్రం ఇచ్చిన మొత్తాన్ని తాత్కాలిక భవనాలకు ఖర్చుపెట్టేశామంటున్నారే?
తెలంగాణలో ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్స్‌లో శాశ్వత సచివాలయం కడతామంటున్నారు. దాని ఖర్చు అంచనా రూ. 180 కోట్లు. ఈ స్థాయిలోనే మన ఆలోచనలు కూడా ఉండి ఉంటే విభజన చట్టంలో పొందుపర్చిన అధికారిక భవనాలన్నీ కేంద్రం ఇచ్చిన రూ. 2,500 కోట్లతో ఇప్పటికే కట్టేసి ఉండవచ్చు. అంతే కానీ రాజధానికి లక్షకోట్లు అవసరమే లేదు.
మన రాజధాని సఫల రాజధాని అవుతుందా విఫల రాజధాని అవుతుందా?
పరిపాలనా రాజధానిగా చేస్తే సక్సెస్ అవుతుంది. రాజధాని గురించి ప్రశ్నిస్తేనే రాష్ట్ర ద్రోహివి అనే అరోపణలకు, ఎదురు దాడులకు దిగితే పరిష్కారం లభించదు. ఒక వర్గం తప్పితే మిగతా వర్గాలేవీ అమరావతిని ఎందుకు తమ సొంతం చేసుకోలేదు అనే అంశంపై ప్రభుత్వం ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అమరావతిని రాష్టంలోని అన్ని ప్రాంతాలూ, ప్రజలూ, ఇతర సామాజిక వర్గాలూ తమ సొంతంగా భావించే పరిస్థితి ఈ రోజుకయితే లేదు. రాజ ధానిపై చర్చను ఎవరు స్వీకరిస్తున్నారు, ఎవరు మొరటుగా దాడి చేసే స్వభావంతో స్పందిస్తున్నారు అని పరిశీలిస్తే చాలు రాజధానిని ఎవరు సపోర్టు చేస్తున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో అర్థం అయిపోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చూస్తే చాలు తెలిసిపోతుంది.
ఈ రాజధాని కొందరి రాజధానా, ప్రజా రాజధానా?
థియరీ ప్రకారం రాజీ ధోరణితో తటస్థ ప్రాంతంలో ఏర్పర్చిన రాజధాని కాదు అమరావతి. వెనుకబడిన ప్రాంతాన్ని మనతోపాటు తీసుకుపోదామని ఎంచుకున్న ప్రాంతం కాదు. సానుకూలం కంటే ప్రతికూల అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చైతన్యవంతంగా ప్రయత్నాలు చేయకపోతే అమరావతి ప్రజా రాజధాని అయ్యే అవకాశాలు లేవు. ఇక తక్షణం మహానగర నిర్మాణం ఆచరణ సాధ్యం కానే కాదని నా స్పష్టమైన అభిప్రాయం.
(ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో..)
https://bit.ly/2GO13S5 / https://bit.ly/2HqbHv4
Comments
Please login to add a commentAdd a comment