పెరిగిన పని ఒత్తిడితో నాలుగో సింహం నలిగిపోతోంది. పోలీసులు సతమతమవుతున్నారు. కింది స్థాయి సిబ్బంది నుంచి ఎస్సైల వరకు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చిన్న జిల్లాల ఆవిర్భావం తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువైంది. సిబ్బంది కొరతతో ఉన్నవారిపైనే పని భారం పడుతోంది. కేసుల విచారణ, నిందితుల అరెస్ట్‌లో కానిస్టేబుల్ నుంచి ఎస్సైలే కీలకం కావడంతో వారికి తీరిక లేకుండాపోతోంది.
జనగామ: రాష్ట్రం ఏర్పాటు తర్వాత సర్కార్ నుంచి పోలీసులకు అత్యున్నతమైన గౌరవం, సౌకర్యాలు దక్కుతున్నా.. అదే స్థాయిలో రెట్టింపు కష్టాలు వేధిస్తున్నాయి. మొన్న ఇవాంక.. నిన్న ప్రపంచ తెలుగు మహాసభలు, రోజూవారీగా మంత్రుల పర్యటనలు ఇలా వరుస డ్యూటీలు చేస్తూ నలిగిపోతున్నారు. బందోబస్తుల పేరుతో జిల్లాలోని పోలీసులు పట్టుమని పది రోజులు కూడా పోలీస్టేషన్‌లో విధులను నిర్వర్తించ లేకపోతున్నారు. అధికారులు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యటనలతో అసలు డ్యూటీ మరిచిపోతున్నారు. అదనపు పని చేస్తూ.. మానసికంగా ఒత్తిడికి గురవుతున్నా.. ఉన్నతాధికారులకు చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది పోలీసులు ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
వరుస బందోబస్తులు
స్టేషన్ డ్యూటీలతోపాటు ప్రభుత్వం తలపెట్టే ప్రతి కార్యక్రమానికి పోలీసుల అవసరం ఉండడంతో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా.. ఒకరోజు ముందే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాక బందోబస్తు పేరుతో పక్కజిల్లాలకు సైతం పంపిస్తున్నారు. సిబ్బంది ఇలా డ్యూటీలపై బయటికి వెళ్లడంతో లేక చాలా పోలీస్‌స్టేషన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. గొడవలు, భూతగాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలా అనేక సమస్యలను ఎదుర్కొం టున్న బాధితులు న్యాయం కోసం ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు.
జనవరి వరకు భారం తప్పదు
జిల్లాలో పోలీసుల సంఖ్య తక్కువగా ఉంది. వచ్చే ఏడాది జనవరి వరకు ఇక్కడ పని చేస్తున్న వారికి పని భారం తప్పదు. ప్రభుత్వం 38 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. తట్టుకుని పనిచేయాల్సిందే. అయినప్పటికీ శాంతిభద్రతల విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నం. –మల్లారెడ్డి, డీసీపీ, జనగామ
వీఐపీల రాకపోకలతో హైవేలపై హడావుడి
‘హలో.. హైదరాబాద్ నుంచి ఫలనా మంత్రి గారు బయల్దేరారు.. తెల్లవారుజామునే పై అధికారుల నుంచి ఫోన్. దీంతో పెంబర్తి నుంచి స్టేషన్ ఘన్‌పూర్ చిన్నపెండ్యాల వరకు హైసెక్యూరిటీ. వెంటనే మరో మంత్రి.. ఆ తర్వాత ఉన్నత స్థాయి అధికారుల పర్యటనలు.. హైవేపై పోలీసులు చక్కర్లు కొడుతున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్, అపరిచిత వ్యక్తులపై నిఘా రోజూ చేయాల్సిన పనే. అటుగా వెళ్లిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు.. కంటిపై రెప్పవాల్చకుండా 24 గంటలపాటు విధులు నిర్వర్తించాల్సిందే.
ఈ బందోబస్తులకు తోడు సమస్యల పరిష్కారానికి జరుగుతున్న ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, రాస్తారోకోలను కట్టడి చేయాల్సిన డ్యూటీ కూడా పోలీసులదే. బందోబస్తు డ్యూటీలు ముగించుకొని అలసిపోయి తీరా స్టేషన్‌కు వెళ్లేసరికి ‘సారూ పొద్దుగాల వచ్చిన.. మా కేసు ఏమైందంటూ’ ఆవేదన వెలిబుచ్చే బాధితుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ఇంత పని ఒత్తిడిలోనూ కేసుల నమోదు, విచారణ, నిందితుల కోసం గాలింపు, కోర్టుకు తరలింపు, కేసుల క్లియరెన్స్‌కు ఉన్నతాధికారుల టార్గెట్లు ఉండనే ఉంటాయి. దీంతో కానిస్టేబుళ్లు, అధికారులు బాధను దిగమింగుకుని విధులు నిర్వరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment