
నిర్మల్: ‘ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవమును..’ అన్న పాటను అణువణువునా నింపుకుని వెళ్లారు. పరాయిగడ్డపై అడుగుపెట్టిన తర్వాత తల్లి భారతికి ఇచ్చిన మాటను మరువలేదు. విదేశీయ మోజు ఎంతున్నా.. స్వదేశీ సంస్కృతిని వీడటం లేదు. అమ్మకు వేల మైళ్ల దూరంలో ఉంటున్నా.. కమ్మనైన అమ్మదనాన్ని ప్రతిక్షణం తలచుకుంటూనే ఉన్నారు. ‘మనుషులుగానే మేం ఇక్కడున్నాం.. మా మనసంతా అక్కడే ఉంది..’ అని చెబుతుంటే వాళ్ల గొంతుల్లో ఈ మట్టిపై ఉన్న మమకారం వినిపిస్తోంది. ఎప్పుడో తరాల కిందటి నుంచే ఉపాధి కోసం.. ఉద్యోగం కోసం రెక్కలు కట్టుకుని సప్తసముద్రాలు దాటుకుంటూ విదేశాలకు వెళ్తున్న మనోళ్లు.. ఈ ప్రపంచం నలుదిశలా ఉన్నారు. ఏ దేశానికి వెళ్లినా.. ఎక్కడ ఉంటున్నా.. మనదైన సంస్కృతీ వారసత్వాన్ని వదలడం లేదు. వాళ్లు పాటిస్తూ.. విలువలను ఆచరిస్తూ.. తమ ముందు తరాలకూ అందిస్తున్నారు. అక్కడే పుట్టి.. అక్కడే పెరిగిన పిల్లలు ఆంగ్లాన్ని అనర్గళంగా మాట్లాడుతూనే.. కమ్మనైన అమ్మభాషలో అలవోకగా పలుకరిస్తున్నారు. అక్కడ చేసేది సాఫ్ట్‌వేర్ నౌకరీలైనా.. పాతకాలం పద్ధతులను ఇంకా పాటిస్తున్నారు. తామున్న రంగంలో.. తాముంటున్న ప్రాంతంలో భారతీయతను చాటుతున్నారు. ‘ప్రవాసీ దివస్’ను పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
పేరుకే విదేశం.. అంతా మనదే..
1947కి ముందు ప్రపంచ దేశాలు మనవైపు చూశాయి. వ్యాపారం పేరుతో వచ్చి దేశ సొత్తును దోచుకెళ్లాయి. ఏళ్ల పాటు మనల్ని బానిసలుగా పాలించిన విషయమూ తెలిసిందే. కానీ ఇప్పుడు భారతీయులు మనదేశంలో లేకుంటే అభివృద్ధి ఆగిపోతుందని ఆగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని వర్గాలు నినదిస్తున్నాయి. ఈ విషయంలో అక్కడి అధ్యక్షుడి తీరునే చాలామంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. అంటే అంతగా అమెరికాలో మనవాళ్లు స్థానం సంపాదించుకున్నారు. మైక్రోసాఫ్ట్‌కు సత్యనాదెళ్ల, పెప్సీ–కోకు ఇంద్రానూయి, గూగుల్‌కు సుందర్‌పిచాయ్ సారథ్యం వహిస్తున్నారు. ఇలాంటి మేటి కంపెనీలు కాకుండా విదేశాల్లోని చిన్న చిన్న వందల వేల సంస్థలకు మనవాళ్లే మార్గదర్శకులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయా దేశాల అభివృద్ధిలో.. అక్కడి వారికి ఉపాధి కల్పించడంలో మనవాళ్లు భాగస్వాములవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచీ విదేశాల్లో వందల సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇతర రంగాల్లో సేవలందిస్తున్న వారు ఉన్నారు.
సంస్కృతిని కాపాడుకుంటూ..
మనం మరిచిపోతున్న పండుగలను విదేశాల్లో ఉంటున్న మనోళ్లు గుర్తుచేసే పరిస్థితి వస్తోంది. అంటే అక్కడ ఉంటున్న వాళ్లు అంత పక్కాగా పండుగలు, ఆచారాలను ఆచరిస్తున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, హోలీ, రక్షాబంధన్.. తదితర పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. దుబాయ్ వంటి నిబంధనలు ఉండే దేశంలోనూ జిల్లావాసులు దసరా ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. అమెరికాలో దీపావళి పర్వదినాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల వారితో కలిసి జిల్లావాసులు సంబురంగా చేసుకుంటున్నారు. దక్షిణాఫ్రికా వంటి దేశంలో సంప్రదాయబద్ధంగా గణేశ్ నవరాత్రులు, నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇక ఆస్ట్రేలియా ఖండంలో ఉండే మనవాళ్లు ప్రతినిత్యం శివలింగానికి అభిషేక పూజలు చేస్తున్నారు. అమెరికాలో ఇటీవల ఆలయాల సంఖ్య పెరిగిపోతోంది. ఇలా ఎంతోమంది ఆదిలాబాద్ వాసులు ఆయా దేశాల్లో స్థిరపడ్డారు. వారంతా భారతీయతను ప్రపంచానికి చాటే వారధులుగా నిలుస్తున్నారు.
అత్యధికంగా ఆ దేశాల్లోనే..
భారతదేశం నుంచి ప్రపంచంలోని 208 దేశాలలో మొత్తం 1,33,27,438 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వీరు కాకుండా స్వల్పకాలికంగా విదేశాల్లో ఉంటున్న వారు 3కోట్ల 12లక్షలకు పైగా ఉన్నారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 20 నుంచి 25 వేల మధ్య ప్రవాస భారతీయులు ఉన్నట్లు అంచనా. ఇందులో అత్యధికులు నిర్మల్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస పోయినవాళ్లే ఉన్నారు. వీరి సంఖ్య దాదాపు 10వేల వరకు ఉంటుందని అంచనా. అధిక సంఖ్యలో భారతీయులు ఉన్న దేశాలు.. వారి సంఖ్య..
ఇండియాలో ఉన్నట్లే ఉంటాం..
పేరుకు అమెరికాలో ఉంటున్నా.. ధ్యాసంతా ఇంటిపైనే ఉంటుంది. ఇటీవలే నిర్మల్‌లో మూడు నెలలు ఉండి వచ్చాను. పిల్లలకు సంబంధించిన శుభాకార్యాలన్నీ అక్కడే చేస్తుంటాను. ఇక ఇంటికి వస్తే ఇండియాలో ఉన్నట్లే ఉంటాం. మేము, మా పిల్లలు అంతా తెలంగాణ యాసలోనే మాట్లాడుకుంటాం. ఇక్కడ పండుగలను చుట్టుపక్కల ఉండే తెలుగువాళ్లు, ఉత్తర భారతీయులతో కలిసి జరుపుకుంటాం. ఏ పండుగనూ మిస్ కానివ్వకుండా చేసుకుంటాం. వీలు దొరికినప్పుడల్లా ఆలయాలకు వెళ్లొస్తుంటాం.
– బ్రహ్మరౌత్ సునీల్‌వర్మ,సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, యూఎస్‌ఏ
అమ్మానాన్నలు ఆశ్చర్యపోయారు..
పదమూడేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. ఇక్కడి బర్ని స్టేట్‌లో సూపర్‌మార్కెట్, పెట్రోల్‌బంక్ బిజినెస్‌లు ఉన్నాయి. భార్య కృష్ణ, కవల పిల్లలు దివి, ధన అందరం ప్రతీవారం ఇక్కడి శివాలయానికి వెళ్తుంటాం. అభిషేకాలు, పూజలు ఇండియాలో చేసినట్లే ఇక్కడ కూడా చేస్తుంటాం. ఇంట్లో అన్ని పండుగలనూ జరుపుకుంటాం. తెలుగువాళ్లందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అమ్మానాన్నలు సుమతి, సత్యనారాయణ ఇక్కడా మన పద్ధతులు ఆచరించడం చూసి ఆశ్చర్యపోయారు.
– నరాల రుక్మకేతన్, బిజినెస్‌మేన్, ఆస్ట్రేలియా
Comments
Please login to add a commentAdd a comment