సాక్షి, దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో దసరా బొమ్మల కొలువు సందడి చేస్తోంది. గత రెండేళ్లుగా ఎయిర్‌పోర్టు అధికారులు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల నుండి అనూహ్య స్పందన రావడంతో ఈ సంవత్సరం కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. భారతదేశపు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.
విదేశీయులు బొమ్మల కొలువు గురించి అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఇక సెల్ఫీలకైతే కొదువేలేదు. సాయంత్రం నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుండడంతో ప్రయాణికులు ఫిదా అవుతున్నారు. దసరా ముగిసే వరకూ ఈ బొమ్మల కొలువు ఉంటుందని ఎయిర్‌పోర్టు ముఖ్య అధికారి సజీత్ తెలిపారు.