
పంచభూతాల సాక్షిగా ఒక్కటైన జంట... ప్రలోభాలకు గురికావడం, మోసబుద్ధిని చూపడం, అది పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. నమ్మిన జీవిత భాగస్వామిని వంచించడం కాపురాలను కకావికలం చేస్తోంది.
కర్ణాటక : వరకట్నం, సఖ్యత లేకపోవడం, పరువుప్రతిష్టలకు వెళ్లి దాంపత్యజీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. వీటికి తోడు అనైతిక సంబంధాలు కూడా కాపురాలను కూల్చుతున్నాయి. భర్త, లేదా బార్య వివాహానికి ముందు, వివాహమైన తరువాత కూడా సంబంధాలను నెరుపుతూ సమస్యల ఊబిలోకి దిగబడుతున్నారు. ఐటీ రాజధాని బెంగళూరులో గత ఏడాది ఇటువంటివి 236 కేసులు నమోదయ్యాయి. బాధితులు సాయం కోరుతూ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని వనితా సహాయవాణి కేంద్రం మెట్లెక్కారు. వేధింపులు, దాడులు, లైంగిక అపసవ్యతలు, చిన్నవిషయాలకే ఘర్షణ, తదితర సమస్యలతో పాటు మూడో వ్యక్తితో సంబంధం ఉందని ఆరోపిస్తూ పరిష్కారాలకు, విడాకులకోసం వచ్చే భార్యభర్తలు అధికంగా ఉన్నారు.
ఎందుకిలా..
నేటి డిజిటల్ యుగంలో ప్రపంచం కుగ్రామం అయిపోగా ఎక్కడెక్కడి వ్యక్తులు, పాత స్నేహితుల మధ్య ఇట్టే పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఇవి కొన్ని పరిస్థితుల ప్రాబల్యంతో లైంగిక సంబంధాల వరకూ వెళ్తున్నాయి. నేటి సమాజంలో ఇదొక ప్రధాన సమస్యగా మారిన మాట నిజమని సామాజికవేత్తలు చెబుతున్నారు.
సంసారం పాడుచేసుకోవద్దు
దంపతులు వివాహేతర సంబంధానికి లోనైతే పిల్లలు ఒడిదుడుకులకు గురి కావడం జరుగుతుంది. క్షణం సుఖానికి సంసారం పాడుచేసుకోవడం సరికాదని కౌన్సిలింగ్ నిపుణురాలు అపర్ణాపూర్ణేశ్ అన్నారు.
విడాకులకు ఇదే కారణం
విడాకులకు వివాహేతర సంబందాలు ముఖ్యకారణం అవుతున్నాయి. వనితా సహాయవాణిని సందర్శించిన మహిళలకు కౌన్సిలింగ్ అందించి వారి జీవితం నిలబెట్టడం మా ప్రధాన ఉద్దేశమని సహాయవాణి చీఫ్ రాణిశెట్టి తెలిపారు.
ఆమె ఘనకార్యం
పేరుపొందిన ప్రైవేటు విద్యాసంస్ధ లో టీచరైన మహిళ భర్త సాప్ట్‌వేర్ ఇంజనీర్. వీరికి ఒక కుమార్తె ఉంది. భర్త నిత్యం విధుల్లో ఉంటూ భార్యను పట్టించుకునేవాడు కాదు. భార్య 2016లో ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో సంబంధం నెలకొల్పుకుంది. భర్తకు అబద్ధం చెప్పి అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లేది. 2017 డిసెంబరులో భార్య వాట్సప్‌ను గమనించగా విషయం గుట్టురట్టైంది. దంపతులిద్దరూ వనితా సహాయవాణిని సంప్రదించగా భార్య తన తప్పు ఒప్పుకుని, ఇక ముందు ఇలా చేయనని హామీనిచ్చింది.
మోసకారి భర్త గుట్టురట్టు
భార్య ఉన్నత ఉద్యోగంలో ఉండగా, భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. భార్య తనకంటే ఎక్కువ వేతనం తీసుకుంటుందని భర్త ఆత్మన్యూనతకు లోనయ్యాడు. వీరికి పదేళ్లు వయసున్న కుమారుడు ఉన్నారు. భార్య వేతనంతోనే నగరంలో స్వంత ఇళ్లు కొనుగోలు చేశారు. భార్యే కుటుంబ భారాన్ని మోస్తోంది. ఆరునెలల నుంచి ఇంట్లో వంట చేయడానికి ఒక మహిళను నియమించుకున్నారు. ఆమెతో భర్త వివాహేతర సంబంధం ప్రారంభించాడు. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఇద్దరి రాసలీలల దృశ్యాలు నిక్షిప్తం కావడంతో భార్య గమనించింది. భర్త వంచనను తట్టుకోలేక భార్య వనితా సహాయవాణిలో ఫిర్యాదు చేసింది. సహాయవాణి అధికారులు ఆ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి సర్దుబాటు చేశారు.
పెరుగుతున్న కేసులు
వివాహేతర సంబంధాలపై 2014–15లో 196 కేసులు
2015–16 నాటికి ఈ సంఖ్య 164.
2016–17 లో మళ్లీ పెరిగి 180కి చేరాయి.
సహాయవాణిలో నమోదైన కేసులు
కేసులు 2014–15 2015–16 2016–17
కుటుంబదౌర్జన్యాలు 490 154 332
వివాహానికి ముందు సంబంధం 64 68 56
వివాహానంతర సంబంధం 196 164 180
వరకట్నవేదింపులు 174 162 153
ఇతరత్రా గొడవలు 53 46 24
పెండింగ్ కేసులు 80 80 78
మొత్తం 1140 1192 1252
Comments
Please login to add a commentAdd a comment