జయనగర: బృహత్ బెంగళూరు మహానగర పాలికె మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక గురువారం జరగనుంది. ప్రాదేశిక కమిషనర్ జయంతి, నగరజిల్లా కలెక్టర్ శంకర్ తదితరులు పాలికె కార్యాలయంలో ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా పాలికె కేంద్రకార్యాలయం చుట్టుపక్కల భారీ భద్రత కల్పించారు. గురువారం ఎన్నికయ్యే మేయర్ 51వ మేయర్‌గా పగ్గాలు చేపడతారు. మేయర్ పద్మావతి (కాంగ్రెస్), ఉపమేయర్ ఆనంద్ (జేడీఎస్) ఇక మాజీలవుతారు. ఈ దఫాకూడా కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి పోటీ చేస్తున్నాయి.
కాంగ్రెస్ సమీక్ష
మేయర్ ఎన్నికపై బుధవారం కేసీసీసీ కార్యాలయంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర్ నేతృత్వంలో ప్రత్యేక భేటీ నిర్వహించారు. కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ... మేయర్, ఉప మేయర్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు విప్ జారీ చేశామన్నారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికే ఓటు వేయాలని ఆదేశించామన్నారు. తమ మద్దతుదారులకు అవకాశం ఇవ్వకపోతే మేయర్ ఎన్నికను బహిష్కరిస్తామని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పిన విషయం తనకు తెలియదన్నారు. ఈ భేటీలో హోంమంత్రి రామలింగారెడ్డి. కార్యాధ్యక్షుడు దినేశ్‌గుండూరావ్, మంత్రులు ఎంఆర్.సీతారాం, కేజే.జార్జ్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యేలు, పాలికె సభ్యులు అభిప్రాయాలు సేకరించారు. అంతిమంగా మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ పెద్దలు నిర్ణయించనున్నారు. నామినేషన్‌కు అరగంట ముందు సీల్డ్ కవర్‌లో మేయర్ అభ్యర్థి పేరును పంపుతారు. మేయర్ రేసులో సంపత్‌రాజ్, గోవిందరాజ్ ఉన్నారు.
మేయర్– ఎస్సీ రిజర్వుడ్
⇒ఈ దఫా మేయర్ పీఠం ఎస్సీ వర్గానికి కేటాయించారు.
⇒ఉపమేయర్ స్థానం జనరల్–మహిళలకు
⇒మొత్తం స్థానాలు 198, ఇందులో బీజేపీ 101, కాంగ్రెస్– 76, జేడీఎస్– 14, ఇతరులు– 07 మంది
⇒ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి మొత్తం ఓటర్లు– 266 మంది. ఈ బలం వల్ల కాంగ్రెస్, జేడీఎస్ గట్టెక్కుతాయి.
రేసులో ఎవరెవరు?
⇒మేయర్ పీఠం అధికార కాంగ్రెస్ తీసుకుంటుంది. ఉపమేయర్ స్థానం జేడీఎస్‌కు కేటాయిస్తుంది.
⇒మేయర్ రేసులో సంపత్‌రాజ్, గోవిందరాజ్ తదితరులు ఉన్నారు
⇒ఉపమేయర్ కోసం ప్రమీళా ఉమాశంకర్, నేత్ర నారాయణ, పద్మావతి నరసింహమూర్తి, మంజుల పోటీ పడుతున్నారు.
ఎన్నిక ఇలా మొదలవుతుంది
⇒మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు గురువారం ఉద యం 8 గంటల నుంచి 9.30లోగా నామినేషన్లు దాఖలు చేయాలి.
⇒11.30 గంటలకు మేయర్ ఎన్నిక ఓటింగ్ మొదలవుతుంది. 11.30 లోగా ఓటర్లు కౌన్సిల్ హాల్‌లోకి చేరుకోవాలి. ఆ తరువాత అనుమతించరు.
⇒నామినేషన్ల ఉపసంహరణకు ఐదు నిమిషాలు కేటాయిస్తారు.
⇒అనంతరం ఓటింగ్ జరుగుతుంది. మొదట మేయర్ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తారు. ఓట్లు లెక్కించి అత్యధిక ఓట్లను పొందినవా రిని మేయర్‌గా ప్రాదేశిక కమిషనర్ జయంతి మేయర్ ప్రకటిస్తారు.
⇒అనంతరం ఉప మేయర్ ఎన్నిక జరుగుతుంది.