పిల్లల కిడ్నాప్‌ ముఠా సంచారం..! | child kidnapping gang in Khammam | Sakshi
Sakshi News home page

పిల్లల కిడ్నాప్‌ ముఠా సంచారం..!

Published Sun, May 27 2018 10:43 AM | Last Updated on Sun, May 27 2018 10:43 AM

child kidnapping gang in Khammam - Sakshi

పిల్లల కిడ్నాప్‌ ముఠా సంచరిస్తున్నదా..? మాయమాటలు చెప్పి తీసుకెళుతున్నదా..? కింది వార్త చదివిన తరువాత.. ఈ రెండు ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానమే వస్తుంది. 

కిడ్నాప్‌ ఇలా... 
ఖమ్మంక్రైం: ఓ బాలుడిని కొందరు పకడ్బందీగా కిడ్నాప్‌ చేశారు. అంతే చాకచక్యంగా వారి నుంచి ఆ బాలుడు తప్పించుకున్నాడు. కల్లూరుకు చెందిన గుండ్ర కుటుంబరావు–అరుణ దంపతుల కుమారుడు ప్రమోద్‌(11), శనివారం సాయంత్రం జ్యూస్‌ తాగడానికి సెంటర్‌కు వచ్చాడు. అప్పటికే అక్కడ టాటా ఏస్‌ వాహనంలో ఆగి ఉంది. అందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళ కూర్చున్నారు. ఆ మహిళ.. ‘‘బాబూ..! ఇలా రా...’’ అని పిలిచింది. ప్రమోద్‌ వెళ్లాడు. ‘‘నీ పేరేమిటి..? ఏం చదువుతున్నావ్‌..? మీ ఇల్లు ఎక్కడ..? మాకు చూపిస్తావా..? మమ్మల్ని తీసుకెళతావా..?...’’ ఇలా ఏవేవో కబుర్లు చెబుతోంది. ఆ చిన్నారి సమాధానమిస్తున్నాడు. లోపల కూర్చున్న ఆ ఇద్దరు పురుషులు, చుట్టూ పరిసరాలను గమనిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. మాట్లాడుతూనే.. తన చేతిలోని కర్చీఫ్‌ను ఆ చిన్నారి మొహానికి బలంగా అదిమింది. ఆ కర్చీఫ్‌కు అప్పటికే మత్తు మందు పూసి ఉండడంతో ప్రమోద్‌ వెంటనే స్పహ కోల్పోవడం, అతడిని ఆ ఇద్దరు పురుషులు వాహనంలో ఎక్కించడం.. క్షణాల్లో జరిగిపోయింది. 

ఇలా తప్పించుకున్నాడు... 
ఆ వాహనం ఖమ్మం దగ్గరలో ఉండగా ఆ చిన్నారి ప్రమోద్‌కు మెలకువ వచ్చింది. సరిగ్గా ఆ క్షణాన.. ఆ చిన్నారి మెదడు పాదరసంలా చక్కగా పనిచేసింది. వారికి అనుమానం రాకుండా ఉండేందుకుగాను, అలాగే పడుకుని ఉన్నాడు. క్రీగంటితో (చూసీచూడనట్టుగా) ఆ ముగ్గురిని, పరిసరాలను గమనిస్తూనే ఉన్నాడు. ఖమ్మం బస్టాండ్‌ వద్ద ఆ వాహనం ఆగింది. ఆ ముగ్గురూ అక్కడ టీ తాగుతున్నారు. వారు ఏమరుపాటుగా ఉండడాన్ని గమనించి, 

నెమ్మదిగా డోర్‌ తెరుచుకుని తప్పించుకున్నాడు. బిగ్గరగా ఏడుస్తూ స్టేషన్‌ రోడ్‌ వైపు పరుగెత్తుతున్నాడు. ఆ ప్రాంతంలోని రాధాకృష్ణ రెడీమేడ్‌ షాపు యజమాని, సిబ్బంది గమనించి ఆ బాలుడిని ఆపి, ఏమైందంటూ ఆరా తీశారు. భయంతో వణుకుతూనే.. మాటలు తడబడుతూ జరిగినదంతా చెప్పాడు. ఆ షాపు వారు వెంటనే వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. బాలుడితో కలిసి బస్టాండ్‌ వద్ద వెతికినప్పటికీ కిడ్నాపర్లుగానీ, వారి వాహనంగానీ కనిపించలేదు.

 ఆ బాలుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్‌ఐ రాము ఇచ్చిన సమాచారంతో ప్రమోద్‌ తల్లిదండ్రులు వచ్చారు. బిడ్డడి కోసం చాలాసేపటి నుంచి వెతుకుతున్నామంటూ వారు భోరున విలపించారు. బిడ్డడిని గుండెలకు హత్తుకున్నారు. ఆ బాలుడిని వారికి ఎస్‌ఐ రాము అప్పగించారు. ఈ బాలుడిని కాపాడిన రాధాకృష రెడీమేడ్‌ షాపు యజమాని రాధాకృష్ణను ఎస్‌ఐలు రాము, ప్రభాకర్‌రావు, ప్రమోద్‌ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement