
ఖమ్మం: వచ్చేవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభతో తెలంగాణలో ఒక ఉత్సవ వాతావరణం నెలకొందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఖమ్మంలో మాట్లాడిన కవిత.. తెలంగాణలో జన జాతర, ఇది మన జాతర అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారని, కానీ ధాన్యం తడిసిపోతే కనీసం పట్టించుకోలేదన్నారు.
‘రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. కనీసం రైతుల కష్టాల మీద ఒక్క రివ్యూ కూడా చేయటం లేదు. రైతుల కష్టాల మీద ఈ ప్రభుత్వం కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఈ జిల్లాతోనే ఉన్నారు.
డిప్యూటీ సీఎం అంటే ఎంత బాధ్యత .. ఆలోచన ఉండాలి...? , ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించుకుంటున్నారు .. తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల జిల్లా అని పేరు ఉంది. ప్రశ్నించే కమ్యూనిస్టు కూడా ప్రశ్నించకపోవడంతో కమ్యూనిజం మీద నమ్మకం సన్నగిల్లింది.
ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు పెద్దలు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్లే ప్రశ్నించడం లేదా.?. తెలంగాణ ఏర్పడిన 9 /10 నెలల్లోనే ఇదే జిల్లాలో భక్త రామదాసు ప్రాజెక్టు కట్టించి 60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పడి 15/ 16 నెలలు అయింది . ఒక కొత్త పథకం లేదు. కొత్త ప్రాజెక్టు లేదు. ముఖ్యమంత్రి గారి పాలన గురించి, మాటల గురించి చెప్పనవసరంలేదు. నేను ఖమ్మం రాగానే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు తన బాధను వ్యక్తం చేశాడు. గ్రామ శాఖ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ పర్యటన చేస్తున్నారు తప్ప .. వాన పడి రాష్ట్ర రైతుల అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించలేదు.
రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ. 20,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా . ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం చెల్లించాలి . అధికారులను అప్రమత్తం చేయాలి. రాష్ట్రంలో పరిపాలన పడకేసింది. మంత్రులు ములుగు పర్యటనకు పోతే.. ఆసుపత్రిలో దుస్థితి వల్ల చనిపోయిన పసిపాపను చూపించారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏ ఒక్క పని అమలు చేయలేదు. రైతు రుణమాఫీ సంపూర్ణం చేశామని ఘోరమైన అబద్ధాలు చెబుతున్నారు. రైతు కూలీలకు ఇస్తామన్న రైతుభరోసా పథకం ఏది..?? , కేసీఆర్ ఇచ్చిన ప్రతీ మాటను నెరవేర్చారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మన్ననలు కోల్పోయింది.
ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రతినిధులను ప్రజలు ఎక్కడికి నిలదీయాలి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ ను ఎంకరేజ్ చేయండి. ఏప్రిల్ 27న టిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి.. బలమైన నాయకత్వం ఉన్న ఖమ్మం జిల్లా నుంచి ప్రజానికం పెద్ద ఎత్తున తరలిరావాలని ఆహ్వానిస్తున్న’ అని కవిత విజ్ఞప్తిచేశారు. .