సాక్షి, ఖమ్మం: పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సీపీఐ 21వ జిల్లా మహాసభలు ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. మన దేశంలో ఉన్న సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉందని, బీజేపీ అధికారంలోకి వస్తే ఇతర దేశాల్లో ఉన్న రూ.71లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తెస్తానని చెప్పిన మోదీ ఇంతవరకు నయాపైసా కూడా తేలేదన్నారు.
బీజేపీ పాలనలో బడా కంపెనీల సంపద పెరుగుతోందే తప్ప సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా మోదీకి ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో గిట్టుబాటు ధర అడిగినందుకు ఏడుగురు రైతులను అన్యాయంగా కాల్చి చంపిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రపంచంలో ఫాసిస్టుల ఆగడాలు, విధానాలతో అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొందన్నారు. అమెరికా అ«ధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను రెచ్చగొడుతూ.. యుద్ధం వైపు మళ్లిస్తున్నారని, దీంతో ప్రపంచ దేశాలను çప్రమాదపుటంచులకు నెట్టివేస్తూ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
అమెరికాలో ఇతర దేశాలకు చెందిన వారు ఎవరూ ఉండకూడదనే ఆంక్షలు పెడుతూ.. ప్రపంచంలో తానే ఎక్కువ అన్న రీతిలో ట్రంప్ వ్యవహారం ఉందని, ఈ విషయంలో అంతర్జాతీయంగా కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని, ప్రభుత్వ అవసరాలకు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని.. అతి తక్కువ ధర చెల్లిస్తూ రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులు బ్యాంకుల్లో తమ అవసరాలకు డబ్బులు దాచుకుంటే వాటికి లెక్కలు అడుగుతున్న మోదీ.. దేశంలోని బడా బాబులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రూ.5లక్షల కోట్లు ఎలా మాఫీ చేశారని ఆయన ప్రశ్నించారు.
నీరవ్ మోదీ అనే వ్యాపారి అక్రమంగా రూ.11,400కోట్ల ప్రజాధనాన్ని మింగేశాడని, రూ.10వేల కోట్లను బ్యాంకులకు ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాపై ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. గో హత్యల నివారణ పేరుతో బీజేపీ సామాన్యులు, మైనార్టీలపై దాడులు చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో దేశంలోని లౌకిక శక్తులను, ప్రజాస్వామికవాదులను, మేధావులను, ప్రజా సంఘాలను, ఇతర వామపక్షాలను కలుపుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో ప్రతిఘటన పోరాటాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పి మాయమాటలతో అధికాంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ దొరల పాలన సాగిస్తున్నారని అన్నారు.
ఉద్యమాలతో సాధించిన రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ధర్నాలు చేయకుండా.. పోలీసుల అండతో ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నారని విమర్శించారు. సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు ఎండీ.మౌలానా ప్రసంగించారు. ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి, భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్‌కే.సాబీర్‌పాషా, అయోధ్య, ప్రసాద్, జమ్ముల జితేందర్‌రెడ్డి, నర్సింహారావు, మహ్మద్ సలాం, సురేష్, రామ్మూర్తి, కమలాకర్, ఎం.లలిత, సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment