సాక్షి, కొత్తగూడెం/అశ్వారావుపేట : రైతుబంధు పథకం, భూ రికార్డుల ప్రక్షాళన దేశానికే ఆదర్శమని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. అన్నదాతలు అప్పులు చేయకుండా పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణను తయారు చేయడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం అశ్వారావుపేట మండ లం అచ్యుతాపురం గ్రామంలో రైతుబంధు చెక్కుల ను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు రూ.12వేల కోట్లు పెట్టుబడి కోసం ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం భూములు వివాదాల్లో ఉన్నాయని, అయినా భూ రికార్డుల ప్రక్షాళనను కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు సమర్థంగా నిర్వహించారని అన్నా రు.
ప్రక్షాళనపై రెవెన్యూ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి మొత్తంమీద 300 గంటలపాటు సమీక్ష చేశారని చెప్పారు. సెక్యూరిటీ ఫీచర్లతో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వారసత్వం కోసం గతంలో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే వారని.. ఇప్పుడా సమస్య సమసిపోయిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా భద్రాద్రి జిల్లాలో మొదటి విడతలో 79,184 ఎకరాలకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.16,124కోట్లు రైతు రుణమాఫీ చేసిందన్నారు.
తెలంగాణ వస్తే రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో పడుతుందని అప్పటి సీఎం కిరణ్ చెప్పారని, అలాంటి ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ 24 గంటలపాటు, ఒక్క నిమిషం కూడా బ్రేక్‌డౌన్ లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. ఇక్కడి ప్రజలు, రైతులు క్రమశిక్షణతో ఉన్నారని అభినందించారు. రాష్ట్ర అభివృద్దిలో ఈప్రాంతానికి చెందిన సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది కీలకపాత్ర అని అన్నారు. కేంద్ర రహదారుల శాఖామాత్యులు నితిన్‌గడ్కరీతో చర్చించి తెలంగాణలోని రహదారుల అభివృద్ధికి రూ.2వేల కోట్లు సాధించారన్నారు.
రైతు సమితుల బాధ్యతలు పెంచాం: వ్యవసాయ మంత్రి పోచారం
రైతు సమన్వయ సమితుల బాధ్యతలు మరింత పెంచామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు మంచి వంగడాలు నాటి, చక్కటి దిగుబడి సాధించేందుకు, మద్దతు ధర అందించేందుకు రైతు సమన్వయ సమితులు పనిచేస్తాయని అన్నారు. రైతు సమన్వయ సమితుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,61,000 మంది సభ్యులు ఉన్నారని, వీరంతా ఒక్కొక్కరు 36 మంది రైతులను కలిస్తే సరిపోతుందన్నారు. 1611 టీఎంసీల గోదావరి నీరు, 600 టీఎంసీల కృష్ణానీరు వృథాగా సముద్రంలో కలుస్తుండగా వీటిపై ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కంకణం కట్టుకున్నారన్నారు. రూ.93వేల కోట్లతో 25వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత 70 ఏళ్లలో రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు.
బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సిన అవసరమే లేకుండా..
బ్యాంకులు రుణాలివ్వాల్సిన అవసరం లేకుండా రైతులను అభివృద్ధిచేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పోచారం అన్నారు. 2022కి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ అన్నారని.. ఏమంత్రం వేసి రెట్టింపుచేస్తారని ప్రశ్నించారు. వ్యవసాయానికి మౌళిక వసతులు పెంచకుండా ఆదాయం ఎలా రెట్టింపు చేస్తారని అన్నారు. రైతు సమన్వయ కమిటీలకు రానున్న రోజుల్లో రూ.300కోట్లు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతీ రైతుకు రూ. 5 లక్షల బీమా : గుత్తా
రైతు సమన్వయ సమితి రాష్ట్ర సమన్వయకర్త గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ రైతుకు రూ.5లక్షల బీమా కల్పించేందుకు రూ.500కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 10వేల ట్రాక్టర్లను సబ్సిడీపై పంపిణీ చేశామన్నారు. కోనసీమను తలపించేలా ఇక్కడి వాతావరణం ఉందని కొనియాడారు.
చిరస్థాయిగా గుర్తుంచుకుంటా: తుమ్మల
తనకు 35ఏళ్ల రాజకీయ జీవితాన్నిచ్చిన సొంత నియోజకవర్గ ప్రజలను చిరస్థాయిగా గుర్తుంచుకుంటానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈప్రాంతానికి ఏం కావాలన్నా దగ్గరుండి అభివృద్ధి చేస్తానన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన వివాదాలను పరిష్కరించి రెండోవిడతలో చెక్కులు అందిస్తామన్నారు.
రైతు పక్షపాతి సీఎం: ఎంపీ పొంగులేటి
రైతుబంధు చెక్కులతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని.. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ వల్లనే టన్ను పామాయిల్ గెలల ధర రూ.10వేలకు పెరిగిందని.. ఈఫ్యాక్టరీని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ త్వరలో వస్తారని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ త్వరలో రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సరిపోతుందన్నారు. ధరణి సాఫ్ట్‌వేర్ ద్వారా జూన్ 2నుంచి పాల్వంచ మండలంలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని, ఆ తర్వాత జిల్లా మొత్తం ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా రైతుసమన్వయ సమితి చైర్మన్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, జేసీ రాంకిషన్, కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్, డీఏఓ అభిమన్యుడు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment