
బానోతు వెంకన్న మృతదేహం
అనారోగ్యం భరించలేక యువతి...
కారేపల్లి : అనారోగ్య సమస్యలను భరించలేని ఓ యువతి తీవ్ర మనోవేదనతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని బాజుమల్లాయిగూడెం గ్రామంలో సోమవారం రాత్రి ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... బాజుమల్లాయిగూడెం గ్రామానికి చెందిన కత్తికోల శ్రీవాణి (21) గత ఏడాది డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. పదేళ్ల క్రితమే తల్లి మృతిచెందింది. తండ్రి వెంకటేశ్వర్లు, అన్నలు నాగేంద్రబాబు, రాకేష్‌తో కలిసి ఉంటోంది. ఐదేళ్ల క్రితం శ్రీవాణికి వెన్నునొప్పి శస్త్ర చికిత్స జరిగింది. అయినప్పటికీ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే అంగవైకల్యం ఏర్పడింది. శరీర ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు లోనైంది. ఆమె, సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కొన్ని గంటల తరువాత తండ్రి వెంకటేశ్వర్లు వచ్చేసరికి నిశ్చల స్థితిలో కనిపించింది. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ అదే రోజు రాత్రి మృతిచెందింది. ఆమె సోదరుడు నాగేంద్రబాబు ఫిర్యాదుతో హెడ్ కానిస్టేబుల్ శశిధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో యువకుడు..
టేకులపల్లి : మద్యానికి బానిసగా మారిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్‌ఐ భూక్య కృష్ణ నాయక్ తెలిపిన వివరాలు... స్థానిక బి–కాలనీ తండాకు చెందిన బానోతు వెంకన్న(24)కు, దేవితో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వెంకన్న, కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడుతున్నాడు. ఆమె విసుగెత్తింది. సోమవారం గట్టిగా మందలించింది. ఇలాగే రోజూ తాగొస్తే పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళతానని బెదిరించింది. దీంతో అతడు మంగళవారం మద్యంమత్తులో పురుగుమందు తాగాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండ గా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆయన భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.