
కమతం ప్రవీణ్ మృతదేహం
మధిర: మండలంలోని సిరిపురం గ్రామ సమీపంలో ఆదివారం లారీ టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. తల్లాడ మండలం స్టేజి పినపాక గ్రామానికి చెందిన కమతం ప్రవీణ్(18), గన్నవరంలో ఏరోనోటికల్ ఇంజనీరింగ్ కోర్సుకు కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండు రోజులు సెలవు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు పినపాకలో బయలుదేరి వైరా వచ్చాడు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా, తన గ్రామానికే చెందిన స్నేహితుడు చొప్పర విద్యాసాగర్, బైక్‌పై వస్తూ కనిపించాడు. తాను గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు విజయవాడ వెళ్లాలని, మధిర రైల్వే స్టేషన్ వరకు వస్తానని అన్నాడు. ఇద్దరూ బైక్‌పై మధిర వెళుతున్నారు.
జాలిముడి ప్రాజెక్టు పనులకు ఏర్పాటుచేసిన టిప్పర్ లారీ, సిరిపురం వద్ద విద్యాసాగర్, ప్రవీణ్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఓవర్‌టేక్ చేసి, ఎటువంటి సిగ్నల్ లేకుండా ఒక్కసారిగా కుడివైపు తిరిగింది. దీంతో, బైక్‌ను ఆ టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరినీ ప్రైవేటు వాహనంలో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ప్రవీణ్ మృతిచెందాడు. ప్రవీణ్, మధిర పట్టణానికి చెందిన మన్నెపల్లి వరప్రసాద్–రత్నకుమారి దంపతుల మనుమడు.