
శఠగోపం పెడుతున్న అర్చకుడి ప్లేట్ కలెక్షన్
సాక్షి, విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో తిరిగి ప్లేట్ కలెక్షన్లు మొదలయ్యాయి. సూర్యకుమారి కార్యనిర్వహణాధికారిగా ఉండగా అర్చకులు ప్లేట్లు ఉంచి భక్తుల నుంచి కానుకలు తీసుకోవడాన్ని నియంత్రించారు. అర్చకుడు శఠగోపం పెట్టిన తరువాత భక్తులు హుండీలోనే కానుకలు ఇవ్వాలని స్పష్టంచేశారు. ఎవరైనా అర్చకులు పేట్లు పెట్టి దక్షిణలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ప్లేట్ కలెక్షన్లకు అర్చకులు స్వస్తి పలికారు. అయితే క్షుద్రపూజల నేపథ్యంలో ఈఓ సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీచేసింది. దీంతో ఆలయంలో మళ్లీ ప్లేట్ కలెక్షన్లు ప్రారంభమయ్యాయి.
ఆలయ ఆదాయానికి గండి
సాధారణంగా దుర్గగుడికి నెలకు రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అర్చకులకు పేట్లలో దక్షిణ రూ పంలో రూ.75 లక్షల వరకు వస్తుందని అంచనా. ఈ ఓ సూర్యకుమారి పేట్ కలెక్షన్ నిలుపుదల చేసిన తరువాత ఆ స్థాయిలో కాకున్నా ఆలయ ఆదాయం కొంతమేరకు పెరిగింది. ప్రస్తుతం అర్చకులు తిరిగి ప్లేట్ కలెక్షన్లు ప్రారంభించడంతో తిరిగి దేవస్థానం ఆదాయం తగ్గే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు.
ప్లేట్ కలెక్షన్‌లో అందరికీ వాటాలు
అర్చకుల వద్ద ఉండే ప్లేట్లలో భక్తులు వేసే దక్షిణ కేవలం అర్చకులకు మాత్రమే తీసుకుంటారనుకుంటే పొరపాటే. ఆ విధంగా తీసుకుంటే అర్చకులు ఆలయ అధికారులు ఆగ్రహానికి గురికాక తప్పదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్లేట్ కలెక్షన్ ద్వారా వచ్చే ఆదాయంలో ఆలయ అధికారుల నుంచి సెక్యురిటీ సిబ్బంది వరకు వాటాలు పంచుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అర్చకులకు రూ.లక్ష వస్తే అందులో వాటాల కింద సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేలు చెల్లిస్తారని సమాచారం. దేవస్థానంలో పరిధిలోని కీలక ఆలయాల్లో పోస్టింగ్‌లు పొందడానికి అర్చకులు అధికారులకు, సిబ్బందికి మామూళ్లు ముట్టచెబుతారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు మామూళ్లు దక్కుతున్నందునే అధికారులు కూడా ప్లేట్ కలెక్షన్‌ను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లేట్లలో భక్తులు సమర్పించే కానుకలను అర్చకులు ఎప్పటికప్పుడు తీసేసి ఎవరికీ అనుమానం రాకుండా చూస్తారని సమాచారం.
చూసీ చూడకుండా ఉండేందుకే..
దేవస్థానంలో పనిచేసే కొంతమంది సీనియర్ అర్చకులు విధులకు హాజరుకాకుండా తమ అసిస్టెంట్లను పంపుతారు. డ్యూటీలో ఎవరూ ఉన్నారనే ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండేందుకు మామూళ్లు ముట్టచెబుతారు. బయటి అర్చకులు దేవస్థానంలోకి రావడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే తాంత్రిక పూజలు జరిగాయని చెబుతున్న రోజు కూడా బయట వ్యక్తులు అంతరాయలయంలోకి వచ్చినా ఎస్‌పీఎఫ్ సిబ్బంది, డ్యూటీలో ఉన్న సిబ్బంది పట్టించుకోలేదు. అదే చివరకు వివాదానికి దారితీసింది.
కొత్త కార్యనిర్వహణాధికారిగా ఐఏఎస్ అధికారి ఎం.పద్మ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె కూడా గత ఈఓ తరహాలో ప్లేట్ కలెక్షన్ నిలుపుదల చేసి, ఆలయ ఆదాయాన్ని పెంచాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment