
విజయవాడ సిటీ: మీడియాను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకే సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీ పేరుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును కుట్రపూరితంగా తెరపైకి తెచ్చారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ టెలివిజన్ రంగంపై పెత్తనం చలాయించాలనే దుర్భిద్ధితో ఉన్నారని దుయ్యబట్టారు. గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
సర్కారుకు నచ్చిన చానళ్లను చూపేందుకే..
మీడియాపై పెత్తనం చలాయించేందుకే కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థలోకి చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశిస్తోందని అంబటి మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఓ చానల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఆరునెలల పాటు ప్రసారాలు చేయనివ్వకుండా ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను తన దగ్గరకు తెచ్చుకుంటే ఇష్టం వచ్చిన చానల్‌ను మాత్రమే చూపించవచ్చనే కుట్రతో ఫైబర్‌గ్రిడ్ తెచ్చారన్నారు. ఫైబర్ గ్రిడ్ ఏ విధంగానూ ప్రజలకు ఉపయోగ పడదన్నారు. ఫైబర్ గ్రిడ్ కింద ఇచ్చే సెట్‌టాప్ బాక్స్‌లకు రూ.4 వేలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు. ప్రజలంతా ఇప్పటికే రూ.2 వేలు చెల్లించి సెట్‌టాప్ బాక్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు.
ట్రాయ్ నిబంధనలు తెలియవా?
ప్రభుత్వ రంగ సంస్థలు టెలివిజన్ రంగంలోకి ప్రవేశించరాదనే ట్రాయ్ నిబంధనలు చంద్రబాబుకు తెలియవా అని అంబటి ప్రశ్నించారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ రూపంలో చంద్రబాబు కేబుల్ రంగంలోకి దొడ్డిదారిన ప్రవేశించాలని చూస్తున్నారని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ మినహా ఇతరులు విద్యుత్, టెలిఫోన్ స్తంభాలపై కేబుల్ వైర్లు అమర్చటానికి వీల్లేదని చట్టవిరుద్ధంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. అయితే రైట్‌వే ఆఫ్ కేబుల్ ఆపరేషన్ అండ్ పర్మిషన్ బై పబ్లిక్ అథారిటీ చట్టం సెక్షన్ 4 బీ ప్రకారం లైసైన్స్ పొందినవారు అండర్ గ్రౌండ్, పోల్స్ (స్తంభాలు)పై లైన్లు వేసుకోవచ్చనే నిబంధన ఉందని తెలిపారు. దీని ఆధారంగా కడపకు చెందిన కొందరు కేబుల్ ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మెమోను కోర్టు కొట్టివేసిందని వెల్లడించారు.
బాబు కోటరీకి దొడ్డిదారిన డబ్బులు
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఈవీఎంల చోరీ కేసులో నిందితుడు వేమూరి హరికృష్ణ సలహాదారుగా, హెరిటేజ్ డైరెక్టర్లు కొల్లి రాజేష్, దేవినేని సీతారామ్‌ను భాగస్వాములుగా పెట్టుకున్నారని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబు కోటరీకి దొడ్డిదారిన డబ్బులు సమకూర్చటంతోపాటు కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను వారి ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఫైబర్‌గ్రిడ్ ముందుకు తెచ్చారని చెప్పారు. కేబుల్ ఆపరేటర్లను రోడ్డుపాలు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని, వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని అంబటి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment