సాక్షి, విజయవాడ: దుర్గగుడి అధికారులు, సిబ్బంది అవినీతిపై పాలకమండలి సభ్యులు త్రీవ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కారణంగా దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటోందంటూ కొంతమంది సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా పాలకమండలి సమావేశం జరిగింది. చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విజిలెన్స్ నివేదికపై ఈవో సూర్యకుమారిపై పాలకమండలి సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. సిబ్బందిపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై ఈవో స్పందిస్తూ దేవస్థానంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందికి నోటీసులు ఇచ్చామని, వారు వివరణ ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు.
టికెట్ రిసైక్లింగ్‌పై గరంగరం
ఈనెల 18న దర్శనానికి వచ్చిన 13 మంది అయ్యప్ప భక్తులకు రీసైక్లింగ్ టికెట్‌లు విక్రయించడంపై పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు. ఇందులో కేవలం అటెండర్ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంటే సరిపోదని, అతని వెనుక ఉన్న అధికారుల వివరాలు చెప్పాలంటూ పట్టుబట్టారు. దీనిపైనా విచారణ చేయిస్తున్నట్లు ఈవో వివరణ ఇచ్చారు.
అర్ధరాత్రి పూజలేంటి?
రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయం మూసివేస్తారు. అయితే, 11.30 గంటలకు దేవాలయాన్ని తెరిచి ఉంచడమే కాకుండా దేవస్థానానికి చెందని అర్చకుడు వచ్చి అమ్మవారికి పూజలు చేయడంపై పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు. నవమి రోజు మహిషాసురమర్దినీదేవికి పూజలు చేయించినట్లుగా తమకు సమాచారం వచ్చిందని, ఇప్పుడు ఆ పూజలు ఎందుకు చేయించాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. అయితే, అటువంటి పూజలు ఏమీ జరగలేదని, అవసరమైతే విచారణ చేయిస్తామని చెప్పారు.
చీరల ఆక్షన్, క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్ నిర్వహణ దేవస్థానానికే..
అమ్మవారికి సమర్పించే చీరలు గతంలో తరహాలోనే దేవస్థానం ఆధ్వర్యంలోనే ఆక్షన్ నిర్వహించాలని నిర్ణయించారు. క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్‌కు ఆక్షన్ నిర్వహించి కాంట్రాక్టర్లకు ఇచ్చే బదులుగా దేవస్థానమే నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది. తలనీలాలకు, స్పాట్ ఫొటోలు, కొబ్బరిచెక్కలు, సీతానగరంలోని దుకాణాలకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. సమావేశంలో ప్రధాన అర్చకుడు ఎల్.దుర్గాప్రసాద్‌తో పాటు, పాలకమండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు, పద్మశేఖర్, బీరక పూర్ణ మల్లికారమ ప్రసాద్, సాంబసుశీల, సూర్యలత, పాప, విజయశేఖర్, బడేటి ధర్మారావు, లక్ష్మి నరసింహారావు, రామనాధం, మోహన్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎర్రముక్కల విక్రయాలు ఆగేనా?
దుర్గగుడికి వచ్చే భక్తులను మోసంచేస్తూ పలు దుకాణాల వారు ఎర్రముక్కలు, అట్టలు పెట్టి చీరలు అమ్ముతున్నారు. వీటిని వేలంలో సేకరించి భక్తులకు తిరిగి అమ్ముతున్నారు. దీనిపై పాలకమండలి చర్చించి వచ్చేనెల 13వ తేదీ తరువాత తిరిగి వేలం వేయకూడదని నిర్ణయించారు. వీటిని దుకాణాల్లో విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. అయితే, ఈ నిర్ణయం ఎంతమేరకు అమలు జరుగుతుందో వేచి చూడాలి.
ఆమోదించిన అంశాలు
► శ్రీశృంగేరీ శారదా పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి నిర్ణయించిన విధంగానే మార్చిలో శ్రీమల్లేశ్వరస్వామి దేవాలయాన్ని పునః ప్రతిష్ట, కుంభాభిషేకం నిర్వహిస్తారు.
►హంసలదీవిలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయాన్ని శృంగేరి శారదా పీఠానికి కాకుండా దేవస్థానమే నిర్వహించాలని నిర్ణయించారు.
►రాయబార మండపాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
►శ్రీప్రత్యేక శనైశ్చరస్వామి ఆలయం, సీతమ్మ వారి పాదాల నిర్మాణం పనిని దాతల సొంత ఖర్చులతో నిర్మించేందుకు ఆమోదించారు.
►పోరంకి వేద పాఠశాల, గొల్లపూడి, అర్జున వీధిలో గోశాలలు ఏర్పాటుచేసి ఆవులు పెంచాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment