
పొగచూరటంతో వాడుముఖం పట్టిన ఆముదం పైరు
సాక్షి,కల్లూరు: కర్నూలు సమీపంలోని భారీ పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పొగలు చిమ్ముతున్నాయి. ఫలితంగా సమీపంలోని గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరు మండల పరిధిలో పందిపాడు, లక్ష్మీపురం గ్రామాల మధ్య ఐరన్ (టీఎంటీ) పరిశ్రమ రెండు నెలల క్రితం పునః ప్రారంభమైంది. దీని నుంచి పొగ విపరీతంగా బయటకు వస్తోంది.
పరిశ్రమ చుట్టూ ఉన్న పొలాలు పొగ చూరి పనికిరాకుండా పోతున్నాయి. పొగ వాసనను భరించలేక పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకల పరిశ్రమకు కార్మికులు రావడం మానేశారు. టీఎంటీ పరిశ్రమకు అనుబంధంగా బాయిలింగ్ ఐరన్ పరిశ్రమ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిస్తోంది. ఇదే జరిగితే బాయిలింగ్ పరిశ్రమ నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి పైర్లపై పడి పంటలు పండే పరిస్థితులు ఉండబోవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిబంధనలు పాటించాలి
పరిశ్రమల నుంచి వస్తున్న పొగ, దుమ్ము, ధూళితో వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నిబంధనల మేరకు పరిశ్రమలను నడపాలి. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమలను సీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– ఎల్లరాముడు, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు

ఐరన్ పరిశ్రమ నుంచి వస్తున్న పొగ