కర్నూలు, మహానంది: తిరుమల తిరుపతి లడ్డూ తర్వాత అంతటి రుచికలిగిన లడ్డూగా మహానంది లడ్డూకు మంచి పేరుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు లడ్డూలను కొనుగోలు చేసేం దుకు అమితాసక్తి చూపుతారు. ఈ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాలకు లడ్డూ మరింత ప్రియం కానుంది. మహానందీశ్వరుడి భక్తులకు ఇది చేదుకబురే అని చెప్పాలి. రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న మహానంది క్షేత్రానికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు వివిధ దేశాలకు చెందిన భక్తులు నిత్యం వేలాది సంఖ్యలో వస్తుంటారు. ప్రతి భక్తుడు లడ్డూలను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఒక్కో లడ్డూ ధర రూ. 10 ఉంది. ఈ ధరకు అదనంగా మరో రూ.5 చొప్పున పెంచి రూ. 15 చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ శివరాత్రి నుంచే ధరలు అమలు చేయచూస్తున్నారు.
భక్తులపై ఏడాదికి రూ. 25లక్షల భారం
ఈ క్షేత్రంలో నిత్యం సుమారు 3వేల నుంచి 3,500లడ్డూలు విక్రయిస్తారు. ఈ ప్రకారం నెలకు 1.05లక్షలు, ఏడాదికి 12లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తుంటారు. దీని ద్వారా ప్రతి ఏడాది ప్రస్తుతం ఉన్న ఒక్కొక్క లడ్డూ ధర రూ. 10 చొప్పున ఏడాదికి 1.26కోట్లు వస్తుంది. రూ. 15 ధర పెంచితే రూ. 1.51కోట్లు వస్తుంది. ఈ లెక్కన ప్రతి ఏడాది భక్తులకు సుమారు రూ. 25లక్షల భారంగా మారనుంది. గత ఏడాది శివరాత్రికి 1.20లక్షల లడ్డూలను విక్రయించగా రూ. 12లక్షలు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ.15 ప్రకారం 1.20లక్షల లడ్డూలపై భక్తులకు అదనంగా రూ.6లక్షల భారం కానుంది.
లడ్డూపై రూ. 3.20 నష్టం
క్షేత్రంలో భక్తులకు ఒక్కో లడ్డూను రూ.10 చొప్పున అందిస్తున్నాము. ప్రస్తుతం ధరలు పెరిగిన నేపథ్యంలో ఒక్కో లడ్డూపై దేవస్థానానికి రూ.3.20పైసల నష్టం వస్తుంది. ధరలు పెరగడం.. దేవస్థానం అభివృద్ధి దృష్ట్యా ధరలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కమిషనర్ అనుమతి కోరిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము. – ఎన్‌సీ సుబ్రమణ్యం,ఈఓ, మహానంది
Comments
Please login to add a commentAdd a comment