laddu price hike
-
ధరలు పెంపు, యాదాద్రిలో మరింత ప్రియం కానున్న స్వామివారి లడ్డూ ప్రసాదం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు జరిపించే శ్రీస్వామి వారి కైంకర్యాలు, శాశ్వత పూజలు, భోగాలతో పాటు ప్రసాదం ధరలను పెంచుతున్నట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి దేవస్థానంతో పాటు కొండపై గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి, అనుబంధ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సైతం ధరలు పెంచినట్లు తెలిపారు. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. యాదాద్రిలో పెంచిన ధరలివి నిజాభిషేకం (ఇద్దరికి) గతంలో రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.800 చేశారు. ఒక్కరికి రూ.250 ఉంటే ప్రస్తుతం రూ.400కు పెంచారు. సహస్ర నామార్చనకు రూ.216 ఉంటే రూ.300, సుదర్శన నారసింహ హోమానికి రూ.1,116 ఉంటే రూ.1,250, నిత్య కల్యాణోత్సవానికి రూ.1,250 ఉంటే రూ,1,500, స్వాతి నక్షత్రం రోజున నిర్వహించే శత ఘటాభిషేకానికి (ఇద్దరికి) రూ.750 ఉంటే రూ.1,000, లక్ష పుష్పార్చనకు రూ.2,116 ఉంటే రూ.2,500, వెండి మొక్కు జోడు సేవలకు రూ.500 ఉంటే రూ.700, సువర్ణ పుష్పార్చనకు రూ.516 ఉంటే రూ.600, వేదాశీర్వచనం రూ.516 ఉంటే రూ.600, ఆండాల్ అమ్మవారి ఊంజల్ సేవకు రూ.750 ఉంటే రూ.1000, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో కలిపి) రూ.500 ఉంటే రూ.800, గో పూజకు రూ.50 ఉంటే రూ.100, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలకు వీఐపీల కోసం ప్రత్యేకంగా రూ.1,500, ఉపనయనం రూ.50 ఉంటే రూ.500, అక్షరాభ్యాసం రూ.51 ఉంటే రూ.200, అష్టోత్తర పూజకు రూ.100 ఉంటే రూ.200, అన్నప్రాశన (ఐదుగురికి) రూ.500 ఉంటే రూ.1000కి పెంచారు. ప్రసాదం ధరల వివరాలివీ.. స్వామివారి లడ్డూ ప్రసాదం ధరలను సైతం అధికారులు పెంచారు. వంద గ్రాముల లడ్డూ గతంలో రూ.20 ఉంటే రూ.30కి పెంచారు. 500 గ్రాముల లడ్డూ రూ.100 ఉంటే రూ.150, 250 గ్రాముల పులిహోర రూ.15 ఉంటే రూ.20, 250 గ్రాముల వడ రూ.15 ఉంటే రూ.20కి పెంచారు. శివాలయంలో, పాతగుట్ట ఆలయంలోనూ పూజల ధరలను పెంచారు. శాశ్వత పూజల ధరలు కూడా పెరిగాయి. -
లడ్డూ ‘మహా’ప్రియం
కర్నూలు, మహానంది: తిరుమల తిరుపతి లడ్డూ తర్వాత అంతటి రుచికలిగిన లడ్డూగా మహానంది లడ్డూకు మంచి పేరుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు లడ్డూలను కొనుగోలు చేసేం దుకు అమితాసక్తి చూపుతారు. ఈ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాలకు లడ్డూ మరింత ప్రియం కానుంది. మహానందీశ్వరుడి భక్తులకు ఇది చేదుకబురే అని చెప్పాలి. రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న మహానంది క్షేత్రానికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు వివిధ దేశాలకు చెందిన భక్తులు నిత్యం వేలాది సంఖ్యలో వస్తుంటారు. ప్రతి భక్తుడు లడ్డూలను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఒక్కో లడ్డూ ధర రూ. 10 ఉంది. ఈ ధరకు అదనంగా మరో రూ.5 చొప్పున పెంచి రూ. 15 చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ శివరాత్రి నుంచే ధరలు అమలు చేయచూస్తున్నారు. భక్తులపై ఏడాదికి రూ. 25లక్షల భారం ఈ క్షేత్రంలో నిత్యం సుమారు 3వేల నుంచి 3,500లడ్డూలు విక్రయిస్తారు. ఈ ప్రకారం నెలకు 1.05లక్షలు, ఏడాదికి 12లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తుంటారు. దీని ద్వారా ప్రతి ఏడాది ప్రస్తుతం ఉన్న ఒక్కొక్క లడ్డూ ధర రూ. 10 చొప్పున ఏడాదికి 1.26కోట్లు వస్తుంది. రూ. 15 ధర పెంచితే రూ. 1.51కోట్లు వస్తుంది. ఈ లెక్కన ప్రతి ఏడాది భక్తులకు సుమారు రూ. 25లక్షల భారంగా మారనుంది. గత ఏడాది శివరాత్రికి 1.20లక్షల లడ్డూలను విక్రయించగా రూ. 12లక్షలు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ.15 ప్రకారం 1.20లక్షల లడ్డూలపై భక్తులకు అదనంగా రూ.6లక్షల భారం కానుంది. లడ్డూపై రూ. 3.20 నష్టం క్షేత్రంలో భక్తులకు ఒక్కో లడ్డూను రూ.10 చొప్పున అందిస్తున్నాము. ప్రస్తుతం ధరలు పెరిగిన నేపథ్యంలో ఒక్కో లడ్డూపై దేవస్థానానికి రూ.3.20పైసల నష్టం వస్తుంది. ధరలు పెరగడం.. దేవస్థానం అభివృద్ధి దృష్ట్యా ధరలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కమిషనర్ అనుమతి కోరిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము. – ఎన్సీ సుబ్రమణ్యం,ఈఓ, మహానంది -
మళ్లీ తెరపైకి లడ్డూ ధరల పెంపు అంశం
నేడు టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చ సాక్షి, తిరుమల: తిరుమలేశుని ఆర్జిత సేవలు, వీఐపీ టికెట్లు, లడ్డూ ధరల పెంపు, కాటేజీల అద్దెలు పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సోమవారం(నేడు) జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు కూడా చేశారు. అలాగే 29వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం రద్దు చేశారు. తెల్లవారుజామున జరిగే తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు.