సాక్షి, తుగ్గలి: ప్రభుత్వ, పురావస్తు శాఖ అధికారుల సాక్షిగా పురాతన కోట ధ్వంసమవుతోంది. గుప్త నిధుల కోసం కోట బురుజులు సైతం తవ్వేస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధులున్నాయన్న ప్రచారంతో ఈనెల 13న అధికారుల పర్యవేక్షణలో ప్రారంభమైన తవ్వకాలు ఆగడం లేదు.
16 రోజుల పాటు పెద్ద బండరాయి కింద తవ్వకాలు చేపట్టినా నిధి ఆనవాళ్లు బయట పడకపోవడంతో చివరకు దానికెదురుగా 30 అడుగుల దూరంలో ఉన్న కోట బురుజులో తవ్వకాలు మొదలుపెట్టారు. రెండు రోజుల క్రితం రెసెస్టివిటీ మీటరుతో జియలాజికల్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘురాం కోట ప్రాంగణంలో సర్వే చేశారు. ఆయన సూచన మేరకు గురువారం ప్రత్యేక పూజలు చేసి.. కోట బురుజులో తవ్వకాలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ పురావస్తు శాఖ అధికారులు లేకుండానే తవ్వకాలు జరపగా.. ప్రస్తుతం ఆ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మహీంద్ర నాయుడు సమక్షంలో తవ‍్వకాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. అధికారులు, పోలీసులు, సిబ్బంది రోజూ కోటపైకి ఎక్కి దిగేందుకు నానా అవస్థలు పడుతున్నారు. 16 రోజులుగా అధికారులు కోటలోనే తిష్టవేసి తవ్వకాలను పర్య వేక్షిస్తున్నారంటే వీరిపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎంత ఉందో ఇట్టే అర్థమవుతోంది. నిధి బయట పడే వరకు తవ్వకాలు వదిలిపెట్టేలా లేరని స్థానికులు చర్చించుకుంటున్నారు. తవ్వకాల ప్రాంతంలో ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, వీఆర్‌ఓ కాశీరంగస్వామి, జొన్నగిరి ఎస్‌ఐ నజీర్ అహ్మద్, పోలీసులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment