సాక్షి, నాగర్‌కర్నూల్: ఆర్థిక సంవత్సరం చివరలో శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు విడుదలయ్యాయి. శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమం(ఏసీడీపీ) కింద ఉమ్మడి పాలమూరులోని నాలుగు జిల్లాలకు కలిపి రూ.25.97 కోట్లు కేటాయించారు. అన్ని జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను వెచ్చించాల్సి ఉంది. 2018–19 సంవత్సరానికి సంబంధించిన నిధులు కావడంతో మార్చి 31లోపు వాటిని అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం 28రోజుల్లో ఈ నిధులను ఖర్చుపెడతారా లేదా అనే సందేహం వ్యక్తం అవుతుంది.
ఏటా జాప్యమే..
నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యేలకు ప్రతి యేటా ప్రభుత్వం కేటాయించే నిధులు ఖర్చు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఎమ్మెల్యే మంజూరు చేసిన నిధులను కూడా చాలా నియోజకవర్గాల్లో అధికారులు ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అభివృద్ధికి మరింత ఊతమిచ్చే విధంగా ఎమ్మెల్యేలకు ప్రతియేటా కేటాయించే నిధులను ప్రభుత్వం రూ.కోటిన్నర నుంచి రూ.3కోట్లకు పెంచింది. అయితే ఈ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కావడం లేదు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50శాతం కూడా ఖర్చు చేయలేని పరిస్థితి. ఎమ్మెల్యేలకు వచ్చే నిధులలో వివిధ పనులకు కేటాయించినప్పటికీ..
ఆ పనుల్లో మాత్రం పురోగతి లేకపోవడం అభివృద్ధికి ఆటంకంగా మారింది. మూడు నెలల క్రితం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టింది. ఈ ఏడాదైనా ఏసీడీపీ నిధులు ఖర్చు చేయడంలో అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాల్లో పలు పనులను గుర్తించారు. వెంటనే ప్రణాళికలు రూపొందించి పనుల వారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కేవలం 28రోజులే సమయం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కొంతమేరకైనా నియోజకవర్గంలో అభివృద్ధికి ముందడుగు పడుతుంది.
విడుదలైన ఏసీడీపీ నిధుల వివరాలు ఇలా..
జిల్లా | విడుదలైన నిధులు (రూపాయలలో) |
మహబూబ్‌నగర్ (నారాయణపేటతో కలిపి) | 11,46,28,652 |
గద్వాల | 2,14,23,039 |
వనపర్తి | 2,13,76,768 |
నాగర్‌కర్నూల్ | 10,22,74,203 |
మొత్తం | 25,97,02,662 |
ఒక్కో ఎమ్మెల్యేకు సుమారు రూ.1.7 కోట్లు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.25.97కోట్లు విడుదలయ్యాయి. వీటిని 14మంది ఎమ్మెల్యేలతో పాటు, ఇద్దరు ఎమ్మెల్సీలకు పంచనున్నారు. ఈ లెక్కన ఒక్కో ఎమ్మెల్యేకు సుమారుగా రూ.కోటి 70లక్షలు అభివృద్ధి పనుల కోసం నిధులు రానున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన నారాయణపేటతో కలిపి మహబూబ్‌నగర్ జిల్లాకు రూ.11.46కోట్లు కేటాయించారు. ఈ జిల్లాలో ఏడు నియోజవర్గాలు ఉన్నాయి. ఈ లెక్కన రూ.1.63కోట్లు ఒక్కో ఎమ్మెల్యేకు కేటాయించే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి రూ.1.70కోట్లు కేటాయించే అవకాశం ఉంది. జోగుళాంబ గద్వాల జిల్లాకు రూ.2.14కోట్లు కేటాయించారు. రెండు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.1.07కోట్లు, వనపర్తి జిల్లాకు రూ.2.13కోట్లు కేటాయించారు.
ఒకే నియోజకవర్గం కాబట్టి రూ.2.13కోట్లు కేటాయించనున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధుల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యధికంగా, వనపర్తి జిల్లాకు తక్కువగా నిధులు వచ్చాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విడుదలైన నిధులను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దేశించిన అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు. నియోజకవర్గాల్లో జనరల్, ఎస్సీ, ఎస్టీ, విభాగాలకు విడివిడిగా నిధులు కేటాయించింది. తాగునీరు, ప్రజాఆరోగ్యం, రోడ్డు నిర్మాణాలు, పాఠశాలల్లో భవనాల ఏర్పాటు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, తదితర పనులకు ఈ నిధులు ఖర్చు చేయవచ్చు. జిల్లా కలెక్టర్, ప్రణాళిక విభాగం విధి విధానాలకు అనుగుణంగా ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
సకాలంలో ఖర్చు పెడతాం..
ఏసీడీపీ నిధులు మంజూరు చేయ డం సంతోషం. నాలుగు వారాల సమయమే ఉంది. అయినా కలెక్టర్‌తో సమన్వయం చేసుకొని అత్యవసర పనులకు ఆ నిధులను వినియోగిస్తాం. భవిష్యత్‌లోనూ నియోజకవర్గ అభివృద్ధికి ఏసీడీపీ నిధులతో పాటు మరిన్ని నిధులను మంజూరు చేయించి అభివృద్ధికి కృషి చేస్తా.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే
తాగునీటికి ప్రాధాన్యం
నియోజకవర్గం ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటా. ముఖ్యంగా పెండింగ్ పనులను పూర్తిచేయించడానికి ఈ నిధులను కేటాయిస్తాన. అలాగే నూతనంగా పాఠశాల భవనాలు, సీసీ రోడ్లు వేయించడానికి కృషి చేస్తా.
–బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment