చేసిన సాయం ఊరకే పోదంటారు.
అవును. ఆయన చేసిన సాయం ఊరకే పోలేదు.
ఒక నిండు ప్రాణాన్ని బతికించింది.
పసిమొగ్గగానే మట్టిలో కలిసిపోకుండా రక్షించింది.
పొందిన మేలు మరువకుండా.. ఆత్మీయంగా అతన్ని పలుకరించింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఆయన 49వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రతియేడు మాదిరిగానే ఎంతోమంది ఖరీదైన కానుకలు, పుష్పగుచ్ఛాలతో ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు. కానీ, అవన్నీ ఇవ్వని సంతృప్తి 101 రూపాయల మనీయార్డర్ ఒకటి ఇచ్చింది. అందులోని ప్రతి అక్షరం సీఎంతో పాటు అక్కడున్నవారందరి హృదయాలను తాకింది. ఓ పేదరాలు పంపిన ఎస్సెమ్మెస్‌పై సీఎం స్పందించిన తీరు ఓ చిన్నారి ప్రాణాలను నిలబెట్టింది. ఫలితంగా మునుపెన్నడూ పొందని ఆత్మీయ శుభాకాంక్షలు ఫడ్నవీస్ సొంతమయ్యాయి.
మరువలేని సాయం..
ఔరంగాబాద్ నియోజకవర్గంలోని కనాకోరి గ్రామానికి చెందిన వేదాంత్ భగవత్ (5)కు ప్రాణాంతక మూత్రాశయ క్యాన్సర్ సోకింది. కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే అతని తల్లిదండ్రులు అందినకాడల్లా అప్పులు చేసి పిల్లాన్ని రక్షించుకుందామనుకున్నారు. కానీ, వారి వద్దనున్న మొత్తం మందులకు కూడా సరిపోవడం లేదు. వేదాంత్‌ను కాపాడుకోవడానికి అతని మేనత్త రేణుకా సాహిల్ గొంధాలి కూడా అన్ని ప్రయత్నాలు చేసింది. వారి స్తోమతకు మించి అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. చేయూతనిచ్చే దిక్కే కరువయ్యారు. మరోవైపు వేదాంత్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. బాలున్ని రక్షించుకునేందుకు దార్లన్నీ మూసుకుపోయిన క్రమంలో రేణుక చివరి ప్రయత్నం చేద్దామనుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి తమ దయనీయ పరిస్థితిని ఒక ఎస్సెమ్మెస్ ద్వారా విన్నవించింది. వేదాంత్ చికిత్సకోసం సాయమందించాలని అర్థించింది. ఆమె వినతిని ఆలకించిన సీఎం.. వేదాంత్ చికిత్స గురించి పూర్తి వివరాలు తెప్పించుకున్నారు. వెంటనే చికిత్స కోసం రూ.1.90 లక్షలు మంజూరు చేశారు. ముంబైలోని ఎమ్మార్‌సీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చికిత్స అనంతరం పిల్లాడు పూర్తిగా కోలుకున్నాడు.
తన అల్లుడి ప్రాణాలు కాపాడేందుకు వచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ నిజంగా దేవుడంటూ రేణుక రాసిన భావోద్వేగ లేఖలోని పంక్తులు.. ‘సీఎం సార్, మీరు నా ఎస్సెమ్మెస్ పట్ల స్పందించి ఓ చిన్నారి ప్రాణాలు కాపాడారు. వైద్యం అందక విలవిల్లాడుతున్న మా అన్నయ్య కొడుకు చికిత్సకు రూ.1.90 లక్షలు మంజూరు చేశారు. వాడి ప్రాణాలు నిలబెట్టారు. ఆయురారోగ్యాలతో మీరు కలకాలం వర్థిల్లాలి. జాతికి సేవ చేయాలి. వైద్యమందక ప్రాణాలు కోల్పోతున్న మరెంతో మంది బీద ప్రజలను ఆదుకోవాలి. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితుల్లో నా వంతుగా ఈ చిరు సాయం చేస్తున్నా’ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రేణుక రూ.101 విరాళం అందించి ఫడ్నవీస్‌కు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
Renuka Gondhali sent me a text message as Vedant Pawar was in need of medical assistance & she got ₹1.90 lakh for his treatment from CMRF !
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 22, 2019
She remembered that & sent me a letter today & did an unforgettable gesture of donating ₹101 towards #CMReliefFund from her earnings ! pic.twitter.com/80232dI4HX
Comments
Please login to add a commentAdd a comment