వర్గల్(గజ్వేల్) : ఉర్సు వేడుకల నుంచి తిరుగు ప్రయాణమైన బంధుగణం రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన శుక్రవారం ఉదయం వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు ఆరుగురు మైనర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ సమీప బంధువులు, సికిందరాబాద్‌లోని అల్వాల్–వెంకటాపూర్‌నివాసులు. క్షతగాత్రుల సంబంధీకులు, పోలీసుల కథనం ప్రకారం... అల్వాల్–వెంకటాపూర్ ప్రాంతానికి చెందిన పి.నర్సింగరావు, కెమ్‌సారం పద్మారావు కుటుంబీకులు, బంధువులు మూడు రోజుల క్రితం రెండు కార్లలో సిద్దిపేట ఉర్సు వేడుకలకు వచ్చారు. శుక్రవారం ఉదయం పిల్లలంతా ఒక కారులో, పెద్ద వాళ్లు మరో కారులో అల్వాల్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో పాతూరు కూరగాయల మార్కెట్ వద్ద కూరగాయలు కొనుగోలు చేసుకున్నారు. మొదట పిల్లలతో వీర ప్రసాద్(38) కారులో బయల్దేరాడు. కొద్ది నిమిషాల వ్యవధిలో రెండో కారులో మిగతావారు వస్తున్నారు. పిల్లలతో వెళ్తున్న కారు వర్గల్ మండలం గౌరారం జనతా హోటల్ దాటిన కొద్ది సేపటికే అదుపు తప్పింది. అమాంతం రాజీవ్ రహదారిపై నుంచి దాదాపు 20 మీటర్ల దూరం లోతైన కల్వర్టు గొయ్యిలోకి దూకింది. కారులోని నర్సింగరావు కూతుళ్లు పి.సుకన్యలక్ష్మి(15), ప్రతిభాలక్ష్మి(13), అనంతలక్ష్మి(6), పద్మారావు కూతురు కెమ్‌సారం ప్రియాంక(17), సమీప బంధువుల పిల్లలు శ్రీశాంక్(10), గురుతేజస్(2), కారు నడుపుతున్న వీరప్రసాద్(35) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా కారులో ఉన్నవారందరూ గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని తెలిసింది.
హాహా కారాలు..
రోడ్డుపై వెళ్తున్న కారు ఊహించని రీతిలో అదుపు తప్పి గాలిలో తేలుతూ రోడ్డు పక్కన కల్వర్టు గుంతలోకి దూకడంతో అందులోని వారందరూ భీతిల్లిపోయారు. గాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న గౌరారం ఎస్సై ప్రసాద్ సిబ్బందితో.. గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను కారు నుంచి వెలికి తీశారు. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెనుకాలే రెండో కారులో వస్తున్న పిల్లల తల్లిదండ్రులు, బంధువులు బోరుమంటూ సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఓ వైపు రక్తం ఓడుతున్న గాయాలతో పిల్లలు, వారిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అక్కున చేర్చుకుంటూ, అనునయిస్తూ విలపించారు. అంబులెన్స్ వచ్చేలోగా నలుగురు క్షతగాత్రులను పోలీసులు తమ వాహనంలో గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని ములుగు 108 అంబులెన్స్ సిబ్బంది కొండల్‌రెడ్డి, శోభన్ ప్రాథమిక చికిత్స చేసి గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం క్షతగాత్రుల సంబంధీకుల కోరిక మేరకు హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు బోల్తా కొట్టకపోవడంతో ప్రాణహాని తప్పిందని భావిస్తున్నారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. గౌరారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని పోతారం శివారులో గల రాజీవ్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడటంతో డ్రైవర్‌తో సహా 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికుల కథనం ప్రకారం... కరీంనగర్–2 డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు మండలంలోని పోతారం శివారులో గల రాజీవ్ రహదారిపై బస్సు బోల్తా కొట్టింది. దీంతో ప్రయాణికుల్లో కరీంనగర్‌కు చెందిన మణికందన్, వరంగల్‌కు చెందిన శ్రీకాంత్, మౌనిక, రామడుగుకు చెందిన సురేందర్, జగిత్యాల్‌కు చెందిన జగన్, ధదర్మారానికి చెందిన రూపాని పద్మ, బొమ్మ బాగ్య, సత్తయ్య, వెంకన్నతో పాటు మరో ముగ్గరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ రవి చేయి విరిగింది. తృటిలో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు భయాందోళన చెందారు. సంఘటనా స్థలాన్ని ఆర్టీసీ కరీంనగర్–2 డిపో మేనేజర్ ధర్మ, కంట్రోలర్ సత్యనారాయణ, బెజ్జంకి పోలీసులు పరిశీలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ సంఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment