కొలువుల కొట్లాట కార్యక్రమానికి వెళ్లకుండా శ్యాంసుందర్‌ను అరెస్ట్ చేసిన దృశ్యం (వృత్తంలో)
మెదక్ : అతనొక రిటైర్డ్ ఎంఈఓ...ఆయన ఇద్దరు కొడుకులు ఎస్సైలుగా పని చేస్తున్నారు. ఒకరు సివిల్ ఎస్సైగా, మరొకరు ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఆ తండ్రిని మాత్రం పోలీసులు తరచూగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. స్టేషన్‌కు తరలించి స్వంత పూచీకతుపై ఏ సాయంత్రానికి వదిలిపెడుతున్నారు. ఇంతకీ ఆ తండ్రి చేసిన నేరం ఏంటని అనుకుంటున్నారా? ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే ఆ అరెస్ట్‌లకు కారణం
పేదల పక్షాన నిలబడి ప్రశ్నించడమే..
మెదక్ పట్టణం అజంపుర వీధికి చెందిన సార శ్యాంసుందర్ 1977 సంవత్సరంలో ఎజ్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలో చేరి ఎంఈఓ స్థాయికి ఎదిగారు. 58 సంవత్సరాల ఆయన సర్వీస్‌లో వేలాది మంది విద్యార్థులకు బతుకు దారి చూపిన ఆయన 2012 సంవత్సరంలో మెదక్ ఎంఈఓగా రిటైర్డ్ అయ్యారు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు కొడుకులు ఎస్సైలుగా స్థిరపడ్డారు. ఒకరు హైదరాబాద్‌లో సివిల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తోంటే, మరో కొడుకు సీఆర్‌పీఎఫ్ ఎస్సైగా ఛత్తీస్‌ఘడ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. శ్యాంసుందర్‌కు నెలనెలా ఐదంకెల పింఛన్ సైతం వస్తోంది. ఎలాంటి ఆర్థిక బాధలు, ఇబ్బందులు లేవు. కానీ ఆయన బాధంతా సమాజంలోని సమస్యలపైనే. వాటిపైనే ఆయన పోరాటం. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సరసన చేరిన ఆయన జేఏసీ జిల్లా కో–చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కోదండరాం పిలుపునిచ్చే ప్రతీ ఆందోళనలో ముందుంటూ పాల్గొంటున్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అరెస్టయ్యాడు. కరీంనగర్ జిల్లా నేరళ్ల ఘటన బాధితులను పరామర్శించేందుకు వెళ్లి అక్కడ అరెస్టయ్యాడు.
రైతు రుణమాఫీలు, అన్నదాతల ఆత్మహత్యలపై కోదండరాం చేపట్టిన ఆందోళనలో అరెస్టయ్యాడు. కొలువుల కొట్లాటకు నిరసనకారులు వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసిన ఘటనలోనూ శ్యాంసుందర్ మాస్టారును అదుపులోకి తీసుకున్నారు. ఇలా ప్రజా సమస్యలపై ముందుండి పోరాటం చేస్తున్న శ్యాంసుందర్ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా మెదక్ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన మర్కిలి పోచయ్య దుబాయి వలసవెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. నెలల తరబడి అతడి మృతదేహాన్ని తీసుకురాకపోవడంతో శ్యాంసుందర్ మాస్టారు బాధిత కుటుంబీకులతో కలిసి మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో ధర్నా చేశారు. పోచయ్య మృతదేహాన్ని రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన ముందుండి ఇతరులకు తన వంతు సేవ చేస్తుంటాడు. తనతోటి పెన్షన్‌దారులతో కలిసి జిల్లా కమిటీని వేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటాడు. పెద్ద వయస్కులు, నడవలేని వారికి ప్రతీ యేటా లైఫ్ సర్టిఫికెట్లను సంబంధిత అధికారులకు సబ్మిట్ చేస్తూ వారికి అండగా ఉంటున్నాడు. తన సామాజిక వర్గానికి చెందిన నిరుపేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, కోచింగ్‌లు ఇప్పించడం వంటి పలు కార్యక్రమాలను సైతం చేస్తూ మన్ననలు పొందుతున్నాడాయన.
ప్రశ్నించేతత్వం ఉండాలి
ప్రతీ వ్యక్తి ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. సమస్యలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తేనే వాటిని నెరవేర్చుతారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే వాటిపై గళమెత్తాలి. అప్పుడే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయి. దీన్ని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలి. నిరుపేదలు ఆపదలో ఉంటే వారి తరఫున నిలబడడం, అత్యవసర సమయంలో తోచిన ఆర్థిక సహాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదు. – సార శ్యాంసుందర్, రిటైర్డ్ ఎంఈఓ, జేఏసీ, ఎస్సీసెల్ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment