
సూపర్30 సినిమా సెట్లో హృతిక్ రోషన్
ముంబై : సినిమాలో తన పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మలుచుకునే కొద్దిమంది భారతీయ నటుల్లో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ ఒకరు. 2012లో వచ్చిన అగ్నిపత్ సినిమా కోసం దాదాపు 30కిలోల బరువు పెరిగారాయన. ఆ తర్వాత వచ్చిన క్రిష్3, బ్యాంగ్ బ్యాంగ్ చిత్రాల్లో ఆయా పాత్రలకు అనుగుణంగా మారిపోయారు.
హృతిక్ కొత్త సినిమా సూపర్30 సినిమాకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆయన సూపర్30 సినిమా సెట్లో దిగిన ఈ ఫోటోలో పూర్తిగా సన్నబడిన లుక్‌లో యుక్త వయస్కుడిలా కనిపిస్తున్నారు. గణిత ఉపాధ్యాయుడి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బిహార్‌కు చెందిన మ్యాథ్స్ టీచర్ ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ కనిపించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వికాస్ బాహ్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీకై సోషల్‌మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించనున్నారు హృతిక్. 2019 జనవరిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు దర్శకనిర్మాతలు.