మళ్లీ సెట్స్ మీదకు 'విశ్వరూపం 2'
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ చిత్రం విశ్వరూపం. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో వెంటనే సీక్వల్ను కూడా రెడీ చేశాడు. అయితే అదే సమయంలో విశ్వరూపం 2 చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్కు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వటంతో విశ్వరూపం 2 ఆగిపోయింది. కొద్ది పాటి షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి.
చాలా రోజులు ఈ సినిమాను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కమల్ ఫైనల్గా ఆస్కార్ రవిచంద్రన్ నుంచి విశ్వరూపం 2 సినిమాను తీసేసుకున్నాడు. త్వరలోనే తన సొంతం నిర్మాత సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. మంగళవారం ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసిన కమల్, త్వరలో పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా ఆ భాగాన్ని చెన్నైలోని మిలటరీ ఆఫీసర్స్ అకాడమీలో షూట్ చేసేందుకు నిర్ణయించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కమల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న శభాష్ నాయుడు సినిమా కూడా సెట్స్ మీదే ఉంది.