
సూపర్‌స్టార్ అభిమానులకు శుభవార్త
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి 2.ఓ. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అణువణువు చెక్కుతున్నారు. ఇంగ్లిష్ భామ ఎమీజాక్సన్ కథానాయకిగా నటించి న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా మారడం విశేషం. 2.ఓ చిత్రం ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
త్వరలోనే ఆ పాటను పూర్తి చేయనున్న శంకర్ ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. కాగా ఈ చిత్రం విడుదల కోసం రజనీకాంత్ అభిమానులు ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు. వారి కోసం ఒక స్పష్టమైన సమాచారాన్ని అందిస్తున్నాం. 2.ఓ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని అక్టోబర్ నెల 27వ తేదీన దుబాయ్‌లోని బూర్జ్‌పార్క్‌లో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు లైకా సంస్థ నిర్వాహకుడు రాజుమహాలింగం వెల్లడించారు.
ఈ వేదికపై చిత్ర సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బ్రహ్మండ సంగీత కచ్చేరి ఉంటుందని చెప్పారు. అదే విధంగా చిత్ర టీజర్‌ను నవంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నామని తెలిపారు. ఇక రజనీకాంత్ పుట్టినరోజు డిసెంబర్ 12 చెన్నైలో 2.ఓ చిత్ర ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించనున్నట్లు, చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2018 జనవరి 25న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.