నా స్థాయిని మరచి కిందకి దిగను | 24 Kisses Trailer Launch | Sakshi
Sakshi News home page

నా స్థాయిని మరచి కిందకి దిగను

Published Fri, Aug 24 2018 2:24 AM | Last Updated on Fri, Aug 24 2018 2:24 AM

24 Kisses Trailer Launch - Sakshi

అనిల్‌ పల్లాల, సంజయ్‌ రెడ్డి, హెబ్బా పటేల్, అదిత్‌ అరుణ్, అయోధ్యకుమార్, మధు

‘మిణుగురులు’ వంటి చిత్రం తర్వాత అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘24 కిస్సెస్‌’. అదిత్‌ అరుణ్, హెబ్బా పటేల్‌ జంటగా రెస్పెక్ట్‌ క్రియేషన్స్, సిల్లీ మాంక్స్‌ కంబైన్స్‌ పతాకంపై సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల, అయోధ్యకుమార్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. డైరెక్టర్‌ అయోధ్యకుమార్‌ మాట్లాడుతూ– ‘‘24 కిస్సెస్‌’ సినిమాని గతంలో వేరే నిర్మాతలతో స్టార్ట్‌ చేశా. అయితే.. నా క్రియేటివిటీ విషయంలో వారి వద్ద నాకు అంత ఫ్రీడమ్‌ దొరకలేదు.

అందుకే సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాలగార్లతో ఈ చిత్రం తీశా. వీరు ఎక్కడా కల్పించుకోకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ‘మిణుగురులు’ వంటి సినిమా తీసిన అయోధ్యకుమార్‌ ‘24 కిస్సెస్‌’ లాంటి సినిమా తీయడమేంటి? అంటున్నారు. నేనెప్పుడూ నా స్థాయిని మరచి కిందకి దిగను. అలా అనుకుని ఉంటే ‘మిణుగురులు’ తర్వాత చాలా సినిమాలు చేసేవాణ్ణి. ఇదొక అందమైన ప్రేమకథ. చక్కని భావోద్వేగాలు ఉంటాయి’’ అన్నారు. ‘‘తుంగభద్ర’ పాటల వేడుకలో నువ్వు లవ్‌స్టోరీస్‌ చేయొచ్చుకదా? అని నానిగారు అన్నారు.

రెగ్యులర్‌ ప్రేమకథలకి భిన్నంగా ఓ చిత్రం చేయాలనుకున్నా. అది ‘24 కిస్సెస్‌’తో తీరింది’’ అన్నారు అదిత్‌ అరుణ్‌. ‘‘సింపుల్‌ ప్రేమకథా చిత్రమిది. మంచి చిత్రంలో అవకాశమిచ్చిన అయోధ్యకుమార్‌ సార్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు హెబ్బా పటేల్‌. ‘‘అయోధ్యగారు రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. కథ నచ్చడంతో ఈ చిత్రంతో నిర్మాతగా మారాను’’ అన్నారు సంజయ్‌రెడ్డి. మరో నిర్మాత అనిల్‌ పల్లాల, నటీనటులు అదితీ మ్యాకల్, అన్షు, మధు, కీర్తన పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్‌ గురల్లా, లైన్‌ ప్రొడ్యూసర్‌: చందా గోవింద్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గిరిధర్‌ మామిడిపల్లి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement