ఆ విషయం బాధ కలిగించింది
►ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి కొత్త పండగ
►ఆర్.నారాయణమూర్తి సినిమాకు థియేటర్లు లేకపోవడం బాధ కలిగించింది..
►‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్
► పార్వతీ పురంలో సందడి చేసిన సినీ నటుడు
పార్వతీపురం : తన చివరి శ్వాస వరకూ కళామతల్లి సేవలోనే ఉంటానని ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’గా తెలుగు సినిమా తెరపై పేరొందిన కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ అన్నారు. శనివారం స్థానిక కొత్తవలసలోని సువ్వాడ సీతయ్య ఇంటికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తన చివరి నిమిషం వరకు కళామతల్లికి సేవ చేసుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన తెలుగు సినిమాకు ఎటువంటి భంగమూ లేదన్నారు. ఒకే భాష మాట్లాడిన వారిని రెండు ముక్కలుగా రాజకీయాలు చేశాయన్నారు.
ఈ ఏడాది పండగకు విడుదలైన మూడు సినిమాలు ఇండస్ట్రీకి పెద్ద పండగనే తెచ్చాయని చెప్పారు. ఆర్.నారాయణమూర్తి సినిమాకు థియేటర్లు లేకపోవడం బాధ కలిగించిందని తెలిపారు. ఇండస్ట్రీలో వారసత్వ నటులు, వర్గభేదాలు అనేవి లేవని స్పష్టం చేశారు. టాలెంట్ ఉన్నవారిని ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుందన్నారు. వర్గాలు లేవనడానికి తానే ఒక ఉదాహరణనని చెప్పారు. అందరి వద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నానని తెలిపారు. తాను ప్రస్తుతం కాటమరాయుడు, ద్వాపర తదితర సినిమాలలో నటిస్తున్నానని వివరించారు.
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’తోనే గుర్తింపు
తాను ఎక్కడికెళ్లినా అందరూ గుర్తు పట్టి, ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటున్నారని, ఆ సమయంలో ఎంతో ఆనందంగా ఉంటుందని పృథ్వీరాజ్ తెలిపారు. ఈ సంక్రాంతికి పార్వతీపురం రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఫ్లెక్సీలు, పూలతో స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. సీతయ్య కొడుకు సురేష్ తనకు మిత్రుడని చెప్పారు. అందువల్లే విశాఖ వచ్చి, అక్కడ నుంచి పార్వతీపురం
వచ్చానని తెలిపారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, జూనియర్ ఆర్టిస్ట్‌లు హాయిగానే ఉన్నారని తెలిపారు.
ఎగబడిన జనం
పృథ్వీరాజ్ వచ్చారన్న విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకుని ఆనందపడ్డారు.