
లైలా సినిమా (Laila Movie) ఈవెంట్‌లో నోటిదురుసు ప్రదర్శించి విమర్శలపాలయ్యాడు నటుడు పృథ్వీరాజ్. అతడి చవకబారు వ్యాఖ్యలపై సోషల్ మీడియా భగ్గుమంది. లైలా సినిమాను బహిష్కరించాలన్న డిమాండ్ మొదలైంది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అతడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపాడు.
వ్యక్తిగతంగా తనకు ఎవరి మీదా ద్వేషం లేదని, తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెప్తున్నానన్నాడు. సినిమాను చంపొద్దని వేడుకున్నాడు. బాయ్‌కాట్ లైలా అనకుండా వెల్‌కమ్ లైలా అనాలని సూచించాడు. ఫలక్‌నుమాదాస్ కంటే లైలా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు. ఇది చూసిన జనాలు.. ఇప్పటికైనా పృథ్వీ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ బుద్ధేదో ముందే ఉండుంటే గొడవ ఇక్కడిదాకా వచ్చేదికాదుగా అని గట్టి పెడుతున్నారు.
విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది.
