2.ఓ చిత్రంలో ఓ దృశ్యం
తమిళనాడు, పెరంబూరు: 2.ఓ చిత్రం కోసం రాష్ట్రంలోని థియేటర్లు 3డీ టెక్నాలజీ హంగులను సంతరించుకుంటున్నాయి. నటుడు రజనీకాంత్ నటిస్తున్న భారీ, బ్రహ్మండ చిత్రం 2.ఓ. శంకర్ దర్శకత్వంలో లైకా సంస్థ దాదాపు రూ.550 కోట్లతో నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటించారు. ఎమీజాక్సన్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.
భారీ అంచనాలతో..
భారీ అంచనాల మధ్య 2.ఓ చిత్రం ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఇది హాలివుడ్ చిత్రాలకు ధీటుగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ ఫార్మెట్‌లో తెరకెక్కిన చిత్రం. ఇంతకు ముందు మైడియర్ కుట్టి సాతాన్, రజనీకాంత్ నటించిన కోచ్చడైయాన్ వంటి రెండు మూడు చిత్రాలు 3డీ ఫార్మెట్‌లో తెరపైకి వచ్చాయి. ఇవి 2డీ నుంచి 3డీకి కన్వర్ట్ చేసిన చిత్రాలు. 2.ఓ చిత్రం ఒరిజినల్‌గా 3డీ ఫార్మెట్‌లో రూపొందించిన తొలి ఇండియన్ చిత్రం అవుతుంది. చిత్ర దర్శకుడు శంకర్ కోరిక మేరకు తమిళనాడులోని థియేటర్లు అన్నీ 3డీ సాంకేతిక పరిజ్ఞాన వసతులతో ముస్తాబుతున్నాయట. తమిళనాడులో మొత్తం 1,000 థియేటర్ల వరకున్నాయి.
వాటిలో 40 శాతం థియేటర్లు మాత్రమే ప్రస్తుతం 3డీ చిత్రాల ప్రదర్శనకు అనుగుణంగా ఉన్నాయి. మిగిలిన 60 శాతం థియేటర్లను 3డీ టెక్నాలజీకి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా ఆధునికరించుకోలేని థియేటర్లను 2.ఓ చిత్ర నిర్మాణ సంస్థే అద్దే విధానంలో రూ.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి చేయించడానికి సిద్ధం అయ్యిందని సమాచారం. దీని గురించి ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ తిరుపూర్ సుబ్రమణి తెలుపుతూ ఇప్పటి వరకూ తమిళనాడులో కొత్తగా 100 థియేటర్లు 3డీ సాంకేతిక పరిజ్ఞానానికి మారినట్లు తెలిసిందన్నారు. సాధారణంగా చిత్ర ప్రదర్శనకు రెండు నెలలకు రూ.20 వేలు అయితే, 3డీ చిత్రాల ప్రదర్శనకు రూ.60 వేలు అవుతుందన్నారు. ఇందుకు తగ్గట్టుగా 3డీ చిత్రాలు వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment