
దివాళా తీసినా 66 లక్షలు విరాళమిచ్చిన సింగర్!
న్యూయార్క్: దివాళా తీసి ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రముఖ ర్యాపర్ '50 సెంట్'.. స్వచ్ఛంద సంస్థ 'ఆటిజం స్పీక్స్'కు లక్ష డాలర్లు (రూ. 66 లక్షలు) విరాళంగా ఇచ్చాడు. ఇటీవల ఈ ర్యాపర్ ఓ ఆటిజం బాధితుడిని పరిహాసమాడాడు. సిన్సినాటీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 19 ఏళ్ల ఆండ్యూ ఫారెల్ ను చూసి.. అతడు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడని భావించి, అతన్ని తూలనాడుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ఫారెల్ సవతి తండ్రి వెంటనే స్పందించి..తన కొడుకు ఆటిజం బాధితుడని వివరణ ఇచ్చాడు.
దీంతో చలించిపోయిన '50 సెంట్' వెంటనే ఫారెల్ కు తన క్షమాపణలు చెప్పాడు. అతడి పట్ల తన దుందుడుకు ప్రవర్తనకు చింతిస్తూ.. ఆటిజంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహనకు కృషిచేస్తున్న 'ఆటిజం స్పీక్స్' సంస్థకు రూ. 66 లక్షలు విరాళంగా ఇచ్చాడు. తన సహచర సంగీత కళాకారులు కూడా ముందుకొచ్చి తమవంతుగా కొంత విరాళం ఇవ్వాలని, ఆటిజంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆయన కోరాడు. 'డా క్లబ్' సింగర్ అయిన '50 సెంట్' అసలు పేరు కర్టిస్ జాక్సన్. తాను దివాళా తీసి ఆర్థిక కష్టాల్లోఉన్నట్టు అతను గత ఏడాది కనెక్టికట్ కోర్టుకు తెలిపాడు.